తెలంగాణలో బీజేపీ పార్టీ ఎలాగైనా సరే తెరాసకి తామే సరైన పోటీదారులమని నిరూపించుకోవాలని చూస్తుంది. అందుకోసం రాబోయే దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, GHMC ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తుంది. సరిగ్గా ఇదే అదునుగా భావించి బీజేపీ తరుపున స్టార్ క్యాంపెనర్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇందుకోసం సరైన కార్యాచరణ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కి వున్నా ఫాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ ప్రచారానికి తోడు పవన్ కనుక ప్రచారానికి వస్తే, అది ఎన్నికల్లో చాలా కలిసివచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీ తరుపున ప్రచారం చేస్తాడా అనేది అనుమానమే.. ఎందుకంటే బీజేపీ తో పొత్తు కేవలం ఆంధ్ర ప్రదేశ్ వరకు మాత్రమే అన్నట్లు ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. అలాంటిది ఇప్పుడు ఉన్నఫళంగా తెలంగాణలో ప్రచారం అంటే ఆయన ఒప్పుకుంటాడా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే వాటికీ కూడా సమాధానాలు బండి సంజయ్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.
బీజేపీ అగ్ర నాయకత్వంతో పవన్ కళ్యాణ్ కి సమావేశం ఏర్పాటు చేపించి, వాళ్ళతోనే అసలు విషయం గట్టిగా చెప్పిస్తే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఒప్పుకునే అవకాశం వుంది. దానికి తోడు పొత్తులో భాగంగా కొన్ని స్థానాలు జనసేనకు ఇస్తామని, తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవచ్చనే విషయం చెప్పి, పవన్ కళ్యాణ్ ని ఒప్పించాలని బండి సంజయ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ గమనిస్తే ఈ ఎన్నికలను బీజేపీ పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధం అవుతుంది.
బీజేపీ అగ్ర నాయకత్వం కూడా కొంచం కష్టపడితే తెలంగాణ లో కాంగ్రెస్ ను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్షముగా బీజేపీకి స్థానం దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.. అందుకే తెలంగాణ మీద ప్రత్యేకమైన శ్రద్ద పెట్టారు. ఇక బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ ని ఒప్పించి ఎన్నికల ప్రచారంలోకి దించితే తెలంగాణలో ఎన్నికల వేడి మరో స్థాయికి వెళ్ళటం ఖాయం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పెద్దగా కేసీఆర్ మీద విమర్శలు చేసిన ఆనవాలు ఏమి లేవు, ఇక ఎన్నికల గోదాంలోకి దిగితే మాత్రం విమర్శలకు పదును చెప్పక తప్పదు.. చూద్దాం మరి బండి సంజయ్ పధకం సఫలమై జనసేన అధినేత ప్రచారానికి వస్తాడో లేడో..