జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన ‘చెట్టు – పిట్ట’ కథ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పిట్ట కథ చెప్పారు. అందులో ఓ చెట్టు కూడా వుంది. ‘చెట్టు – పిట్ట’ కథ అన్నమాట. ‘పిట్ట అయితే ఎగిరిపోతుందేమో.. నేను చెట్టుని.. వేళ్ళతో భూమిని బలంగా పట్టుకున్న చెట్టుని.. నేనెక్కడికి వెళ్ళిపోతాను.? నా పార్టీని విడిచి వెళ్ళను.. నా ప్రజల్ని విడిచి వెళ్ళను..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన ‘చెట్టు – పిట్ట’ కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

చాలామంది పవన్ కళ్యాణ్ చెప్పిన ‘చెట్టు – పిట్ట’ కథని, ఆ పవన్ కళ్యాణ్ సోదరుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవికి ఆపాదిస్తున్నారు. చిరంజీవినే పవన్ కళ్యాణ్ పిట్టలా అభివర్ణించారనీ, ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారనీ, ఆ తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేశారనీ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇందులో నిజం లేకపోలేదు.

సో, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది తన అన్న చిరంజీవిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకేనా.? ‘నేను రాజకీయాల్ని వదిలేసినా, రాజకీయాలు నన్ను వదల్లేదు..’ అని చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆడియో సారాంశం ఇదేనా.? అన్న చర్చ జరగకుండా ఎందుకు వుంటుంది.?

ఇక, పవన్ కళ్యాణ్ గతంలో యువరాజ్యం అధినేతగా (ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్) పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వదిలేశారు. జనాన్ని కూడా వదిలేశారు. మళ్ళీ, 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించారు. ప్రజారాజ్యం పార్టీ మొదటి చెట్టు అయితే, జనసేన పార్టీ రెండో చెట్టు అన్నమాట పవన్ కళ్యాణ్‌కి.

ఈ లెక్కన ‘నేను చెట్టులాంటోడ్ని..’ అని పిట్ట కథలు చెబితే ఎలా.?