ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ జనసేన, బీజేపీలు పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. 2024నాటికి ఎలాగైనా బలపడాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ తమకంటూ స్థానిక మద్దతు కావాలనే ఉద్దేశ్యంతో జనసేనతో దోస్తీ చేశారు. పవన్ సైతం సిద్ధాంతాలు దగ్గరగా ఉండటంతో బీజేపీతో చెలిమి చేస్తున్నారు. వీరి చెలిమిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు నూటికినూరు శాతం అందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, బీజేపీ నేత ఉప్పలపాటి కృష్ణం రాజు పవన్, బీజేపీల దోస్తీ మీద స్పందించారు.
ఒకటికి రెండు కలిస్తే మంచిదే కదా అన్న కృష్ణం రాజు సిద్దాంతాలు ఒకతయాయ్యి కాబట్టి కలిసి పనిచేయడం బాగాఉంది. జనసేన, బీజేపీల పొత్తు హర్షణీయం. ఇద్దరూ కలిసి ప్రజలకు సేవ చేయాలని పనిచేసినంత కాలం బాగుంటుంది. ఆంధ్రాలో బలపడాలని బీజేపీ బలంగా కృషి చేస్తోంది. మేము కూడ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ తో కలవడం ఒక మంచి పరిణామం అన్నారు. కృష్ణం రాజు ఏపీ బీజేపీలో పెద్ద లీడర్. బీజేపీ తరపున 1998లో కాకినాడ నుండి రికార్డ్ మెజారిటీతో లోక్ సభకు ఎంపికైన ఆయన యూనియన్ మినిష్టర్ గా పనిచేశారు.
కోస్తాఆంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉన్న కృష్ణం రాజు ఇలా పవన్, బీజేపీల కలయికను స్వాగతించడంతో ఉప్పలపాటి కుటుంబానికున్న సినీ అభిమానులు ఇకపై జనసేనకు మద్దతుపలుకుతారని, ముఖ్యంగా భారీ స్టార్ డమ్ ఉన్న ప్రభాస్ అభిమానులు జనసేన, బీజేపీల కూటమికి అనుకూలంగా మారుతారని, అప్పుడు కాకినాడ, గోదావరి జిల్లాల్లో కూటమి బలపడుతుందని కొత్త లెక్కలు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. చూడాలి మరి వారి లెక్కలు ఎంతవరకు పనిచేస్తాయో.