జనసేన అధినేత, తెలంగాణ గ్రేటర్ ఎన్నికల్లో త్యాగరాజు ట్యాగ్ తగిలించుకున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్లి వచ్చిన కానీ, ఇప్పటికి అక్కడ ఏమేమి జరిగిందో ఒక సృష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు, నడ్డాతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను మాత్రమే గమనిస్తే ఈ మాత్రం దానికే రెండు రోజులు ఢిల్లీ పర్యటన అవసరమా అని అనిపించకమానదు. ఇందుకు ఒక రోజు ఎదురుచూపుల్లోనే గడిచిపోయింది అనుకోండి..
తిరుపతి గయా
గ్రేటర్ ఎన్నికల పోటీ నుండి తప్పుకొని బీజేపీకి మద్దతు ప్రకటించి జనసైనికుల దృష్టిలో చులకనైనా కానీ, బీజేపీ దృష్టిలో హీరో కావచ్చని, దానిని క్యాష్ చేసుకొని తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేసే అవకాశం జనసేనకు దక్కేలా చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ భావించినట్లు సమాచారం, కానీ జనసేనకు నడ్డా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. పైగా ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి ఏ పార్టీ తరఫున ఉండాలనే అంశంపై నడ్డాతో ప్రాథమికంగా చర్చించామని జనసేనాని తెలిపారు.మరోవైపు తిరుపతి ఉప ఎన్నికలో తమ అభ్యర్థే పోటీలో ఉంటారని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు అభ్యర్థి ఎంపికపై కమిటీ వేసినా, అది మొక్కుబడి వ్యవహారమేనని చిన్న పిల్లాడిని అడిగిన చెబుతారు. కేవలం పవన్‌ని సంతృప్తి పరచడానికి, జనసైనికులు కూడా తమకు బీజేపీ విలువ ఇస్తోందని జనాల్లో చెప్పుకోడానికి ఒక సాకు కోసం ఈ డ్రామా అని అందరికీ అర్థమవుతోంది.
అమరావతి రాజధాని
పవన్ కళ్యాణ్ ప్రధానంగా మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి నడ్డా గారితో మాట్లాడటం జరిగిందని మా కూటమి రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. ఇవి నా మాటలు కావు. నడ్డా నోటి నుంచి వచ్చిన మాటలివి. అమరావతి రైతులకు బాసటగా ఉంటాం. చివరి రైతు వరకు న్యాయం జరిగే దాకా పోరాడతాం’ అని నడ్డా గారు నాతో అన్న మాటలంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. అదే నిజమైతే కేంద్రంలో ఉన్న బీజేపీ రాజధాని మార్పును అడ్డుకోవచ్చు కదా..? అలా చేయకుండా విభజన చట్టంలో “ఏ” అనే పదం ఉంది కాబట్టి ఒక్క రాజధాని మాత్రమే కాదని, ఎన్ని రాజధానులైన పెట్టుకోవచ్చని, అది ఆ రాష్ట్ర పరిధిలోని విషయమని బీజేపీ ఎందుకు తప్పించుకు తిరుగుతుంది.. పవన్ కళ్యాణ్ ఆ విషయం మర్చిపోయి ఉంటాడని నడ్డా ఆ మాట చెప్పాడో, లేక జనాలు మర్చిపోయి ఉంటారని పవన్ కళ్యాణ్ చెపుతున్నాడో కానీ రాజధాని విషయంలో బీజేపీ రెండు నాల్కుల ధోరణి ఎవరు మర్చిపోలేదు..
ఇక పోలవరం విషయం అంటారా.. ఇందులో బీజేపీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోలవరం ఆలస్యం అవుతుందంటే దానిని ప్రధాన కారణం బీజేపీ పార్టీ అనే ముద్ర ఆంధ్రాలో బలంగా పడింది, దాని గురించి పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు చెప్పిన వినటానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే పవన్ ఢిల్లీ టూర్ వెళ్లి సాధించింది ఏమి లేదు.. ఎదో గ్రేటర్ లో దించిన తల ఢిల్లీలో ఎత్తితే గౌరవంగా ఉందని ఢిల్లీ టూర్ వెళతాడు తప్పితే అంతకు మించి ఏమి లేదని తెలుస్తుంది.