అప్పుడు నారా చంద్రబాబునాయుడు చేసింది తప్పయితే, ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నదేంటి.? అఖండ భారతావని నుంచి పాకిస్తాన్ విడిపోయింది 75 ఏళ్ళ క్రితం.. ఇదే రోజున. ఆనాటి ఆ దారుణ పరిస్థితుల్ని ఎలా మర్చిపోగలం.? చాలామంది దారుణ హత్యకు గురయ్యారు. ఎందరో నిరాశ్రయులయ్యారు. కానీ, కాలక్రమంలో ఆ గాయం కాస్త మానింది. మళ్ళీ ఇప్పుడు ఆ గాయాన్ని గుర్తు చేసుకుని భయపడాల్సిందేనా.? ‘పార్టిషన్ హర్రర్స్ రిమంబరెన్స్ డే’ (విభజన గాయాల లేదా దారుణాల లేదా భయాల స్మారక దినం) అంటూ ఆగస్ట్ 14వ తేదీన ఆనాటి ఆ పరిస్థితుల్ని గుర్తు చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ విభజనతో రాష్ట్ర విభజనను ముడిపెట్టడం ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఏడేళ్ళు దాటినా సరైన రాజధాని లేని దుస్థితి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే అది విభజన చేసిన గాయమే.
విభజన గాయాల్ని గుర్తు చేసుకునేందుకు ప్రతి యేటా జూన్ 2వ తేదీ నుంచి వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాల్ని చంద్రబాబు ప్రభుత్వం గతంలో నిర్వహించింది. అప్పట్లో చంద్రబాబు తీరుపై చాలా విమర్శలొచ్చాయి. అలాంటి కార్యక్రమాలు పొరుగు రాష్ట్ర ప్రజల్లో లేనిపోని ఆలోచనల్ని కలిగిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, చంద్రబాబు మాత్రం తన పని తాను చేసుకుపోయారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, ఆ కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారనుకోండి.. అది వేరే విషయం. ఇంతకీ, ప్రధాని అయ్యాక.. ఏడేళ్ళ తర్వాత నరేంద్ర మోడీ ఎందుకు ఆనాటి దేశ విభజన అంశాన్ని గుర్తు చేసుకుంటున్నట్లు.? కాస్త ఆలోచించాల్సిన విషయమే. నిజమే, అప్పట్లో జరిగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఇప్పుడు ఆ గాయాల్ని గుర్తు చేసుకోవడం ద్వారా ఏం లాభం.? అంటే, దానికి సమాధానం ‘పొలిటికల్ పబ్లిసిటీ’ అనే అంటున్నారు చాలామంది.