నిమ్మ‌గ‌డ్డ వెంట పార్క్ హ‌య‌త్..వ‌ద‌ల‌డం అంత వీజీనా?

ఇటీవ‌లే గ‌వ‌ర్న‌ర్ భిశ్వ‌బూష‌ణ్ హ‌రించంద‌న్ ఆదేశాల మేర‌కు నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ని మ‌ళ్లీ ఏపీ స‌ర్కార్ నియ‌మించే అవ‌కాశం క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు జ‌రిగిన ఎపిసోడ్ గురించి తెలిసిందే. జ‌గ‌న్ స‌ర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ని ప‌ద‌వి నుంచి త‌ప్పించిన‌ప్ప‌టి నుంచి! ఆయ‌న ప్ర‌భుత్వంతో ఎలా పోరాటం చేసారో తెలిసిందే. నువ్వా? నేనా? అన్న స్థాయిలో ప్ర‌భుత్వంతో నిమ్మ‌గడ్డ ఢీకొట్ట‌డం నిజంగా గ్రేట్ అనే అనాలి. ఈ వ్య‌వ‌హార‌మంతా రాజ్యాంగానికి లోబ‌డే జ‌రిగింది. అంతా చ‌ట్ట‌బ‌ద్ద‌మే. అయినా పార్క్ హ‌యత్ ఘ‌ట‌న ముందు వ‌ర‌కూ నిమ్మ‌గ‌డ్డ వెనుక న్యాయం ఉంద‌ని అంతా భావించారు.

కానీ పార్క్ హ‌య‌త్ ఘ‌ట‌న తో సీన్ రివ‌ర్స్ అయింది. నిమ్మ‌గడ్డ కూడా రాజ‌కీయాలు చేస్తున్నారా? అన్న అనుమానం రేకెత్తింది. బీజేపీ నేత‌లు సుజ‌నా చౌంద‌రి, కామినేని శ్రీనివాస్ తో మంత‌నాలు జ‌ర‌ప‌డమే నిమ్మ‌గ‌డ్డ కు తంట తెచ్చిపెట్టిన‌ట్లు అయింది. ఈ ఇద్ద‌రు కూడా ఒకే సామాజిక వ‌ర్గానికి చెంద‌డం. చంద్ర‌బాబుకి స‌న్నిహితులు కావ‌డం తో ఈ ముగ్గురు ఒక్క‌టేన‌ని జ‌నాల్లోకి బ‌లంగా వెళ్లిపోయింది. పార్క్ హ‌య‌త్ సీసీపుటేజీ లీక్ వ్య‌వ‌హారం మీడియా స‌హా ప్ర‌జ‌ల్లో బాగా హైలైట్ అయింది. నిమ్మ‌గ‌డ్డ‌కు న్యాయ‌ప‌రంగా పోరాటం చేయ‌డానికి కావాల్సిన కోట్ల రూపాయాల్ని చంద్ర‌బాబు అండ‌తో ఈ ఇద్ద‌రు అంద జేసార‌ని ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

ఇదే నిమ్మ‌గ‌డ్డ చేసిన అతిపెద్ద స్వీయ త‌ప్పుగా రాజ‌కీయ నిపుణుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఆ ముగ్గురు పార్క్ హ‌య‌త్ లో క‌ల‌వ‌డం వెనుక సుజ‌నా చౌద‌రి చెప్పిన కార‌ణాలు వేరే ఉన్నాయి. కామినేనితో స‌ప‌రేట్ గా…నిమ్మ‌గ‌డ్డ‌తో స‌ప‌రేట్ గా మాట్లాడాన‌ని..ఇది రాజ‌కీయ అంశాలు కావ‌ని అన్నారు. నిమ్మ‌గ‌డ్డ ఎప్ప‌టి నుంచో తెలుస‌న‌ని…పార్క్ హ‌య‌త్ లో ఫ్యామిలీ విష‌యాలు మాట్లాడుకున్నామ‌ని అన్నారు. దీనికి వైకాపా నేత‌లు ఫ్యామిలీ విష‌యాలు పార్క్ హ‌య‌త్ లో మాట్లాడుకుంటారా? ఇంట్లో మాట్లాడుకుంటారా? అని విమ‌ర్శించ‌డం జ‌రిగింది. ఇక తాజాగా గ‌వ‌ర్న‌ర్ ఆదేశాలు నిమ్మ‌గ‌డ్డ‌కు అనుకూలంగా ఉన్న నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ‌ను ఎలాగైనా అడ్డుకునే ప్ర‌య‌త్నాన్ని ప్ర‌భుత్వం మానుకోద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పార్క్ హ‌య‌త్ లో అస‌లు ఏం జ‌రిగింది! అన్న ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు సేక‌రించడానికి పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. దానికి సంబంధించిన పూర్తి సీసీ టీవీ పుటేజీల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది.

.