గత ఎన్నికల్లో టీడీపీకి దారుణమైన దెబ్బతగిలిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం. ఇక్కడ వైఎస్ జగన్ హవా పూర్తి స్థాయిలో కనబడింది. ఫ్యాన్ గాలి ముందు సైకిల్ నిలబడలేకపోయింది. టీడీపీకి అండగా ఉన్న కుటుంబాలు కూడ ఓడిపోయి చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి. అలాంటి కుటుంబాల్లో పరిటాల కుటుంబం ఒకటి. ఇంతకు ముందు తాము గెలవడమే కాదు అనంతపురం జిల్లాలో, చుట్టుపక్కల జిల్లాల్లో కూడ టీడీపీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించేవారు. పరిటాల రవి బ్రతికున్నంత వరకు సీమలో తెలుగుదేశం ఒక వెలుగు వెలిగింది. ఆయన తర్వాత ఆయన స్థానంలోకి వచ్చిన ఆయన సతీమణి పరిటాల సునీత కూడ దాదాపుగా అదే లెవల్లో టీడీపీని నడిపారు. కానీ 2014 తర్వాత సీన్ మారిపోయింది.
పరిటాల వ్యతిరేక వర్గాలు టీడీపీలో చేరడంతో క్యాడర్ పరిటాల కుటుంబానికి దూరమైంది. ఫలితంగా పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుండి ఓటమిపాలయ్యారు. ఆ ఓటమితో పరిటాల ఫ్యామిలీ రాజకీయాలకే కాదు టీడీపీకి కూడ దూరమైన వాతావరణం కనబడింది. అసలు శ్రీరామ్ అయితే అస్సలు కనబడనేలేదు. జిల్లాలోనే కాదు రాప్తాడు నియోజకవర్గంలో కూడ ఆయన కార్యకలాపాలేవీ జరుగుతున్న దాఖలాలు కనబడలేదు. దీంతో పరిటాల ఫ్యామిలీ టీడీపీని వీడే ప్రయత్నంలో ఉందనే వార్తలు పుట్టుకొచ్చాయి. పరిటాల ఫ్యామిలీ మౌనం చూసి అదే నిజం అనుకున్నారు. ప్రత్యర్థులైతే పరిటాల శ్రీరామ్ ఎస్కేప్ అన్నట్టు మాట్లాడారు. వైసీపీ హవా, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దూకుడు ముందు శ్రీరామ్ నిలబడలేకున్నారని అన్నారు.
కానీ తాజాగా శ్రీరామ్ మీడియా ముందుకొచ్చిన తీరు చూస్తే ఇంకా ఆ ఫ్యామిలీలో మునుపటి జోరు, తెగింపు ఉన్నాయని అర్థమవుతుంది. గుంటూరు జిల్లా వినుకొండలో నందమూరి తారక రామారావు , పరిటాల రవీంద్ర విగ్రహాలను పోలీసుల సహాయంతో, 144 సెక్షన్ పెట్టి అర్ధరాత్రి తొలగించారు. ఈ ఘటన పరిటాల కుటుంబానికి ఆగ్రహం తెప్పించింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న శ్రీరామ్ బయటికొచ్చి ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్షాల మీద కక్ష సాధింపుకు, దివంగత నేతల విగ్రహాలు కూల్చడానికి కాదని, రాష్ట్ర అభివృద్దికని, ఏ ప్రభుత్వమైనా ప్రజల క్షేమం కోసం పనిచేస్తే బాగుంటుందని ఎన్నాడూ లేనంతగా ఫైర్ అయ్యారు. అది చూసిన పరిటాల ఫాలోవర్స్ శ్రీరామ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.