శరీరావయవాలన్నీ చక్కగా వున్న ఆటగాళ్ళు ఇటీవల ఒలింపిక్స్ పోటీల్లో తలపడిన విషయం విదితమ. భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించినవారిలో చాలామంది నిరాశపర్చితే, కొందరు సత్తా చాటారు. ఆట అన్నాక గెలుపోటములు సహజం. వెళ్ళినవాళ్ళంతా మెడల్స్ తీసుకురాలేదని అనడం సబబు కాదు. అయితే, 130 కోట్ల మంది జనాభా వున్న భారతదేశం నుంచి ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేందుకు వెళుతున్నవారు తక్కువగా వుండడం.. అందులోనూ పతకాలు తెచ్చేవారు మరీ తక్కువగా వుండడం బాధ కలిగించే విషయమే. దేశంలో క్రీడల పట్ల పాలకులు చూపుతున్న శ్రద్ధకు ఇది నిదర్శనం. ఇప్పుడు పారా ఒలింపిక్స్ సందడి కనిపిస్తోంది. దేశానికి పతకాలు పోటెత్తుతున్నాయ్. ఏదో ఒక వైకల్యంతో వున్నవారు, ఆ వైకల్యాన్ని అధిగమించి.. పతకాల వేటలో సత్తా చాటుతున్నారు.
బంగారు పతకాలు వచ్చిపడుతున్నాయ్.. రజత, కాంస్య పతకాల సంగతి సరే సరి. పారా ఒలింపిక్స్ విజేతలతో, సాధారణ ఒలింపిక్స్ విజేతల్ని పోల్చలేం. ఇక్కడ ఎవర్నీ తక్కువ చేయడానికీ వీల్లేదు. కానీ, మాట్లాడుకునే క్రమంలో అన్నీ సక్రమంగా వున్నవారు తక్కువ పథకాలు సాధిస్తే, వైకల్యంతో బాధపడుతున్నవారు ఎక్కువ పథకాలు సాధిస్తున్న దరిమిలా.. ఈ ఉత్సాహం తదుపరి ఒలింపిక్ పోటీలకు మరింత పెరిగి.. మరిన్ని పతకాలు మన దేశానికి రావాలని ఆశించడం తప్పెలా అవుతుంది.? రాష్ట్రాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. క్రీడల్ని ప్రోత్సహించాలి. ఔత్సాహిక క్రీడాకారులకు తగిన సౌకర్యాలు కల్పించడమే కాదు, క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా స్కూలు స్థాయి నుంచే చిన్నారును ప్రోత్సహించాలి. అసలు ఆటలకు అవకాశం లేని స్కూల్ అనేదే వుండకుండా చేయగలిగినప్పుడు.. దేశం నుంచి క్రీడా ఆణిముత్యాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయ్.