వేలాది మంది.. కాదు కాదు లక్షలాది మంది పర్యాటకులు.. ప్రకృతి సోయగాల్ని చూసి మైమర్చిపోయారు.. కానీ, అనూహ్యంగా జరిగిన ఓ ఘటన ఒక్కసారిగా ఆ ప్రకృతి సోయగాల్ని తలచుకుంటేనే పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యేలా చేసింది. ఏడాదిన్నర క్రితం గోదావరి నదిలో విహారయాత్ర సృష్టించిన విషాదమది. 50 మందికి పైగా పర్యాటకులు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో, పాపికొండలు యాత్ర మాత్రమే కాదు, జల పర్యాటకాన్ని రాష్ట్రమంతటా నిలిపేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. మళ్ళీ ఇంత కాలానికి తిరిగి గోదావరి నదిపై పర్యాటకానికి అనుమతినిచ్చింది ప్రభుత్వం.
ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాదిమంది ఈ పర్యాటకంపై ఆధారపడి ఉభయ గోదావరి జిల్లాల్లో జీవిస్తున్నారు. వారందరి వెతల్ని దృష్టి పెట్టకుని, ప్రయాణీకుల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, తిరిగి పర్యాటకాన్ని గోదావరి నదిపై షురూ చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. అయితే, ప్రమాదాలనేవి చెప్పి రావు కదా.! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాసరే.. టైమ్ బ్యాడ్ అయితే అంతే సంగతులు. అందుకే, గతంలో పాపికొండల అందాల్ని తిలకించిన పర్యాటకులు ఇప్పుడు ఆ పేరు చెబితే ఇంకా భయపడుతూనే వున్నారు. ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయిలో భద్రత విషయమై భరోసా ఇస్తామంటోంది. తిరిగి బోటింగ్ ప్రారంభమయితే తమ జీవితాలు బాగుపడతాయని పర్యాటకంపైనే ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్న దరిమిలా అటు పర్యాటకులకు హాని జరగకుండా, ఇటు పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్నవారి జీవనం వెలుగమయం అయ్యేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే.. కాస్త ఆలస్యమైనా.. మునుపటి స్థాయికి పర్యాటక రంగం గోదావరి నదిపై పుంజుకునే అవకాశాలున్నాయి.