రాజకీయాల్లో పదవులు ఆశించకుండా సేవచేసే వారు చాలా తక్కువగా ఉంటారన్న విషయం తెలిసిందే.. ఇక పదవులు రాకుంటే వేరే పార్టీలోకి జంప్ చేసి అంతవరకు ఉన్న పార్టీ మీద విమర్శలు కురిపించడం నాయకులకు అ ఆ లు చెప్పినంత సులువుగా మారిపోయింది.. ఈ ఘటన అన్ని రాష్ట్రాల రాజకీయాల్లో సర్వసాధారణమే.. ఇకపోతే గ్రహణం పట్టిన టీడీపీలో జరుగుతున్న లుకలుకలు కొన్ని బయటకు రాలేకపోతున్నా, మరి కొన్ని బయటకు వస్తున్నా ఆ పార్టీ మీద సానుభూతి చూపించడం మానేశారట ఏపీ ప్రజలు.. ఇప్పటికే పచ్చ బస్సులో సీట్లన్ని దాదాపుగా ఖాళీ అయిపోతుండగా కళకళలాడే టీడీపీ ఇలా అవడానికి కారణం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు అనే ప్రచారం జరుగుతుందట..
ఈ నేపధ్యంలో మరో అసంతృప్తి జ్వాల రగులుకుంటున్న నాయకురాలు వెలుగులోకి వచ్చారు.. ఆ విషయం ఏంటో చూస్తే.. ఫైర్ బ్రాండ్ అంత పేరు లేకపోయినా ఓ మోస్తారు మాటలతో ప్రత్యర్ధులను పరెషాన్ చేసే సత్తా ఉన్న నాయకురాలు అని పేరుతెచ్చుకుని టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ.. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా టీడీపీకి తన సేవలు అందిస్తున్నారట.. ఇక విజయవాడ మేయర్‌గా 1995లో పనిచేసిన కాలంలో మంచిగుర్తింపు కూడా తెచ్చుకున్నారట.. కాగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆమె.. బీసీ కోటాలో తనకు పదవి దక్కుతుందని గత చంద్రబాబు హయామంలో ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో గత ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుండి టికెట్‌ను ఆశించినట్టు ప్రచారం జరిగింది.. అయితే అక్కడి టికెట్‌ను తన తనయుడు లోకేష్‌కు ఇచ్చుకున్నారు చంద్రబాబు.. ఆ తర్వాత తెలుగు మహిళ అధ్యక్ష పదవికి ఎంపిక జరిగినప్పుడు కూడా తన పేరు వస్తుందని ఆశించారు. అయితే.. దీనిని ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేటాయించారు చంద్రబాబు. అయిన నిరాశ చెందక టీడీపీలోనే తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆనుకుని ఇటీవల పార్లమెంటరీ జిల్లాల మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తుండడంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ వీటిలోనూ ఆమెకు చోటు దక్కలేదు.
ఇలా గుంటూరు, విజయవాడలో ఎక్కడా తనకు చోటు దక్కకపోవడంతో పార్టీలో హుశారుగా ఉండే పంచుమర్తి అనురాధ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారట. ఇకపోతే ఆమెకు ఏపదవి రాకపోవడానికి కారణం టీడీపీ ఎంపీలు, కొందరు నాయకులట. ఇక చంద్రబాబు సైతం పట్టించుకోలేదట. ఇలా టీడీపీలో తనకు ఇంత అన్యాయం జరగడాన్ని జీర్ణించకోలేని ఆమె తాజా పరిణామాలతో మరో ఆలోచనలో పడ్డారట.. బాబు ఇంత ద్రోహం చేస్తారని ఊహించలేదట.. మరి చూడాలి రానున్న రోజుల్లో అనురాధ ఏ నిర్ణయం తీసుకుంటుందో..