రాజకీయ నాయకులు మీడియా ముందుకొచ్చి చేసే రాజకీయ విమర్శలకు అర్థమే వుండదు. ఎందుకంటే, పార్టీ మారగానే.. ఆయా వ్యక్తులు తాము ఆయా పార్టీలనుంచి వచ్చిన స్క్రిప్టు మాత్రమే చదివామని చెబుతుంటారు గనుక. ఇలా, ప్రెస్ మీట్లు పెట్టే నాయకులకు రాజకీయ పార్టీలు అదనపు చెల్లింపులు కూడా చేస్తాయట. ఆ మధ్య ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత, మరో రాజకీయ పార్టీపై విమర్శ చేసే క్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ మాత్రందానికి రాజకీయ నాయకులు చెప్పే సొల్లు కబుర్లని మీడియా ఎందుకు సీరియస్‌గా తీసుకుంటున్నట్టు.? తప్పదు, పత్రికల సర్క్యులేషన్ పెంచుకోడానికో.. న్యూస్ ఛానళ్ళు తమ టీఆర్పీ రేటింగులు పెంచుకోడానికో.. అలాంటి వివాదాస్పద అంశాల్ని హైలైట్ చేయాల్సిందే. ఇప్పుడు అసలు విషయానికొచ్చేద్దాం.
ఉగాది నాడు పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన పంచాంగ శ్రవణాలు వచ్చేశాయి. ఈ పంచాంగాల్ని పండితులే తయారు చేశారా.? లేదంటే, ఆయా రాజకీయ పార్టీల అధినేతలు తయారు చేశారా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. జ్యోతిషం, పంచాంగం.. అనేవి వేర్వేరుగా వుండవు.. అందిరికీ ఒకటే. పండితులు రాసే పంచాంగాలన్నీ ఒకేలా వుంటాయి. రాజకీయ పార్టీలు రాసే పంచాంగాలు మాత్రమే వేర్వేరుగా వుంటాయి. తెలుగు నాట ఈ పంచాంగ శ్రవణాలు గత కొంతకాలంగా ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. ఏ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చెబితే, ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని అందులో ప్రస్తావిస్తుంటారు సదరు పండితులు. అదెలా సాధ్యమవుతుంది.? అదే మరి మ్యాజిక్ అంటే. ఓ పండితుడు, రాష్ట్రంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి ఈ ఏడాదిలో చెడు జరుగుతుందని సెలవిచ్చాడు. ధాంతో, ఆయా పార్టీలు తమ ప్రత్యర్థుల మీద సెటైర్లేయడానికి ఈ పంచాంగాన్ని వాడేస్తున్నాయి. ఇలా భ్రష్టుపట్టిపోయింది పంచాంగ శ్రవణం అనే గొప్ప కార్యక్రమం రాజకీయ పార్టీల కారణంగా.