ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మింగలేక.. కక్కలేక అన్నట్టుగా ఉంది. అయితే.. టీడీపీకి ప్రస్తుతం దొరికిన ఒకే ఒక చాన్స్ తిరుపతి ఉపఎన్నిక. ఈ ఎన్నికల్లో నిరూపించుకుంటూనే ఏపీలో టీడీపీ ఇంకా ఉందని తెలుస్తుంది. ఏపీ ప్రజలు కూడా టీడీపీని భవిష్యత్తులో ఆదరిస్తారని అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు తిరుపతి ఉపఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
అందుకే.. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాకముందే.. అందరికంటే ముందే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు. గత ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మీనే ఈసారి కూడా తమ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు.
అయితే.. తిరుపతి ఉపఎన్నికల్లో తనను సంప్రదించకుండానే పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ప్రకటించారంటూ పనబాక లక్ష్మీ అన్నట్టుగా తెలుస్తోంది. అంటే.. ఆమెను సంప్రదించకుండానే చంద్రబాబు తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిగా లక్ష్మీని ప్రకటించారా? అనేది ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమైంది.
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. పనబాక లక్ష్మీ ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారట. చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని.. అందుకే తన డిమాండ్లను నెరవేర్చుతేనే టీడీపీలో కొనసాగుతానని.. లేదంటే బీజేపీలో చేరడానికి తాను సిద్ధంగా ఉందట.
పనబాక బీజేపీలో చేరుతోందనే విషయం చంద్రబాబుకు తెలిసే.. ఆమెను సంప్రదించుకుండానే తిరుపతి ఉపఎన్నికలో తనను నిలుపుతున్నట్టు పేరు ప్రకటించారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె పేరును ప్రకటించినా కూడా ఆమె నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం.. ఆమె అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవాలనుకుంటోందని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు వెంటనే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డిని రంగంలోకి దించి… లక్ష్మీని బుజ్జగించాలని చెప్పారట. దీంతో ఆమె కొన్ని డిమాండ్లను ఆయన ముందు ఉంచిందట. మరి.. ఆ డిమాండ్లకు చంద్రబాబు ఒప్పుకుంటారా? చివరి వరకు ఆమె టీడీపీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? లేక బీజేపీలో చేరుతారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మిగిలాయి.