పాటకు పల్లవి.. విరాటపర్వం సినిమాకు సాయి పల్లవి చాలా ముఖ్యం: డైరెక్టర్ వేణు

దగ్గుబాటి రానా, సాయి పల్లవి కలిసి ఇటీవల నటించిన సినిమా విరాట పర్వం. ఈ సినిమాని దర్శకుడు వేణు ఊడుగుల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. 1990 లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రవన్న పాత్రలో రానా నటించగా..వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది. ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈ నెల 17 వ తేదీ తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.

జూన్ 15 వ తేదీ సాయంత్రం 6 గంటలకి హైదరబాద్ లో విరాటపర్వం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సినిమా యూనిట్ చాలా గ్రాండ్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రానా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఎల్లప్పుడూ వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఉంటే రానా తన అభిమానుల కోసం ఇకపై వారికి నచ్చిన సినిమాలు చేస్తానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. విరాట పర్వం సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో నటించడం వల్ల ఇలాంటి సినిమాలు వద్దని ఆయన అభిమానులు కోరారు. దీంతో రానా ఇకపై ఇలాంటి సినిమాలు చేయనని ఇదే చివరి సినిమా అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా సినిమా దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ.. “సింహాలు వాటి చరిత్రను అవి రాసుకోలేనంతవరకు వేటగాడు చెప్పేదే చరిత్ర అవుతుంది.. అలాగే మన జీవితాలను మనం ఆవిష్కరించనంత వరకు పక్కవాళ్లు చెప్పేదే మన సంస్కృతి అవుతుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది గొప్ప వ్యక్తుల స్ఫూర్తి తో 1990 కాలం నాటి మూలాల్లోకి వెళ్లి ఈ సినిమా తీశాను. 1990 దశకంలో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని ఆధారంగా తీసుకొని దానికి గొప్ప ప్రేమ కథను జోడించి ఈ విరాట పర్వం సినిమా తెరకెక్కించాను. ప్రతి పాటకు పల్లవి ఎంత అవసరమో విరాటపర్వం సినిమాకి కూడా సాయిపల్లవి అంతే ముఖ్యం అంటూ సాయి పల్లవి గురించి చాలా గొప్పగా వర్ణించాడు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇది ఒక గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది అంటూ వేణు చెప్పుకొచ్చాడు.