Own Media : 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందడానికి వున్న చాలా కారణాల్లో యెల్లో మీడియా కూడా ఓ బలమైన కారణం. ఔను, తెలుగుదేశం పార్టీ ఏ ‘యెల్లో’ మీడియాని అయితే నమ్ముకుందో, ఆ యెల్లో మీడియానే టీడీపీ కొంప ముంచేసింది.
అధికారంలో ఎవరున్నా, అనుకూల మీడియాని నమ్మకూడదు. ప్రభుత్వం తరఫున ఎలాగూ భజన చేసుకుంటారు గనుక, తమ అనుకూల మీడియాలో ఇంకో భజన అనవసరం. పైగా, సొంత మీడియాలో వచ్చే కథనాల్ని నమ్మడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.
టీడీపీకి సొంత మీడియా లేదు.. కానీ, సొంత మీడియా తరహాలో కొన్ని పత్రికలు, ఛానళ్ళు వ్యవహరిస్తాయి. వైసీపీకి అయితే సొంతంగానే మీడియా సంస్థలున్నాయి. అందులో ఎలాగూ ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన కథనాలు రావు.
ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందుతుందనేది తెలిసే అవకాశం కేవలం వైసీపీ వ్యతిరేక మీడియా వల్లనేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తెరగాలి. కానీ, దుష్ట చతుష్టయం.. అంటూ ఆ వర్గం మీడియా మీద ముఖ్యమంత్రి విద్వేషం కక్కుతున్నారు.
సంక్షేమ పథకాల అమలు తీరు దగ్గర్నుంచి, మహిళల భద్రత సహా కీలకమైన అంశాల్లో వైసీపీ వ్యతిరేక మీడియాలో వచ్చే కథనాలను అనుసరించి జాగ్రత్త పడకుండా సొంత మీడియానే నమ్ముకుంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఏ గతి పట్టిందో, వైసీపీకి కూడా వచ్చే ఎన్నికల్లో అదే గతి పడుతుంది.