వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ మధ్య ముదిరిన ఆదిపత్య పోరు వ్యవహారం ఢిల్లీకి చేరిందా.? ఢిల్లీ వేదికగా ఇద్దరి నేతల మధ్యా ఆధిపత్య పోరు జరగబోతోందా.? ఈ పోరులో ఎవరిది పై చేయి కాబోతోంది.? ఇలా రకరకాల ప్రశ్నలు ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్స్ అయ్యాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో వైఎస్ జగన్ భేటీ అవుతారు. పోలవరం ప్రాజెక్టు, కరోనా వైరస్ సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వైఎస్ జగన్ మంతనాలు జరుపుతారు. ఈ క్రమంలో వైఎస్ జగన్, రఘురామకృష్ణరాజు వ్యవహారంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, రఘురామ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అవసరమే వుండదన్నది వైసీపీ శ్రేణుల వాదన.
కాగా, ఢిల్లీలో ఇప్పటికే రఘురామ తాను చెయ్యాల్సినదంతా చేసేశారు. పలువురు కేంద్ర మంత్రులకు తనపై జరిగిన థర్డ్ డిగ్రీ టార్చర్ అంశానికి సంబంధించి ఫిర్యాదులు చేశారు. దాంతోపాటు, కరోనా సహా అనేక అంశాలపై రాష్ట్రం తరఫున కేంద్రానికి రఘురామ తనదైన స్టయిల్లో ప్రతిపాదనలు, విజ్నప్తులు కూడా చేసెయ్యడం గమనార్హం. తాజాగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పలు అంశాల్ని రఘురామ, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ముందు ప్రస్తావించారట.
ముఖ్యమంత్రి ఢిల్లీకి రానున్నారన్న ప్రచారం నేపథ్యంలో రఘురామ అత్యంత వ్యూహాత్మకంగా ముందస్తు విజ్నప్తుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకి కొన్ని పెండింగ్ నిధులు వున్నాయి. ఆ నిధుల్ని విడుదల చేయాలని వైఎస్ జగన్, కేంద్రాన్ని కోరాల్సి వుంది. కరోనా వ్యాక్సినేషన్, పేదలకు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కేంద్ర సాయం.. ఇలా పలు అంశాలపై ముఖ్యమంత్రి, ఢిల్లీ పెద్దల్ని అభ్యర్థించనున్నారు.