దివంగత నేత నందమూరి తారక రామారావు విషయంలో నారా చంద్రబాబు నాయుడు మీద ఎన్నో విమర్శలున్నాయి. పెద్దాయన్ను మోసం చేసి తెలుగుదేశం పార్టీని లాక్కున్నారని, ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పటికీ ఎన్టీఆర్ వారసుల చేతిలోకి పార్టీని వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు నాయుడు మీద ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వైసీపీ నేతలైతే నేరుగా ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో చంద్రబాబు వలనే క్షోభ అనుభవించారని అంటుంటారు. ఈ విమర్శలు చాలవన్నట్టు చంద్రబాబు మీద తాజాగా మరొక విమర్శ తయారైంది. అది కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూలంగా కావడం విశేషం.
ఈమధ్య కేసీఆర్ మీద ఆంధ్రా నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిశాయి. కారణం ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో పాఠం రూపంలో చేర్చారు అక్కడి ప్రభుత్వ పెద్దలు. ఎన్టీఆర్ లాంటి మహానేత గొప్పతనాన్ని భావితరాలకు తెలిసేలా ఇలా పాఠ్య పుస్తకాల్లో ఆయన జీవిత విశేషాలను పెట్టడం గొప్ప విషయమని ఎన్టీఆర్ అభిమానులు, ప్రముఖులు కేసీఆర్ మీద పొగడ్తలు కురిపించారు. స్వయంగా బాలకృష్ణ సైతం కేసీఆర్ చర్యలను పొగిడారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నొరెత్తి ఒక్క మాట కూడ మాట్లాడలేదు. దీంతో ఆయన మీద విమర్శలు బయలుదేరాయి.
ఎన్టీఆర్ గొప్పతనాన్ని కేసీఆర్ గుర్తించారు. కానీ ఆయన అల్లుడు, ఆయన స్థాపించిన టీడీపీ ద్వారా మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకు మాత్రం రామారావుగారి మీద ఆమాత్రం గౌరవం లేకపోయిందని, ఆయన చేయలేకపోయిన పనిని కేసీఆర్ చేస్తే కనీసం ఒక్క పొగడ్త మాట మాట్లాడలేకపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజెంట్ అమరావతి కోసం బాబు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అదంతా తన రియల్ ఎస్టేట్ బృందం కోసమేనని, వారిమీదున్న ప్రేమలో ఇసుమంతైనా ఎన్టీఆర్ మీద ఉండి ఉంటే బాగుండేదని కానీ లేకపోయిందని విమర్శిస్తున్నారు. అంతటితో ఆగకుండా అసలు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఎందుకు డిమాండ్ చేసి సాధించలేకపోయారాని ఎద్దేవా చేస్తున్నారు.