ఆపరేషన్ హుజూరాబాద్: స్కెచ్ రెడీ చేస్తున్న రేవంత్ రెడ్డి

Revanth Is Gearing Up For The Show

Revanth Is Gearing Up For The Show

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన ఎంపీ రేవంత్ రెడ్డి, తొలి అగ్ని పరీక్షను హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా ఎదుర్కోనున్న విషయం విదితమే. నిజానికి, రేవంత్ రెడ్డి రాజకీయ యుద్ధం చేయాల్సింది ప్రత్యర్థి పార్టీలతో కాదు, సొంత పార్టీలోని కొన్ని శక్తులతోనే. కాంగ్రెస్ పార్టీకి వేరే శత్రువు అక్కర్లేదు. ఎందుకంటే, ఆ పార్టీలోనే తిరుగుబాటు బావుటా ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. జాతీయ స్థాయిలో అయినా, రాష్ట్రాల స్థాయిలో అయినా, కాంగ్రెస్ పార్టీకి ఈ ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పెను శాపం.

రేవంత్ రెడ్డి సైతం ఆ అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగా ఇప్పటికే ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తోంది. రేవంత్ ఎంపిక పట్ల అసహనంతో కొందరు కాంగ్రెస్ సీనియర్లు, పార్టీకి దూరమవడం చూస్తున్నాం. అలాంటివారందర్నీ కలుపుకుపోయేందుకు రేవంత్ రెడ్డి తనవంతుగా ప్రయత్నిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయమై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి వుంది. కానీ, ఉప ఎన్నికకు పెద్దగా సమయం వుండకపోవచ్చు.

ఈ నేపథ్యంలో రేవంత్, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా యుద్ధ ప్రాతిపదికన పార్టీ మీద పట్టు సాధించే చర్యలు చేపట్టాలి. కానీ, అది అంత తేలికైన వ్యవహారం కాదు. అభ్యర్థి ఎంపిక దగ్గర్నుంచి చాలా వ్యవహారాలుంటాయి. నిజానికి, ఈ వ్యవహారంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి ‘ప్లానింగ్’తో అధిష్టానానికి సమాచారమిచ్చారనే చర్చ జరుగుతోంది. ఆ ప్లానింగ్ నచ్చడంతోనే అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందని చెబుతున్నారు.

జులై మొదటి వారంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్ రెడ్డి, ఆ క్షణం నుంచే ‘ఆపరేషన్ హుజూరాబాద్’ను అధికారికంగా అమలు చేయబోతున్నారనట. నిజమేనా.? రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి తగిన మద్దతు లభిస్తుందా.? కాలమే సమాధానం చెప్పాలి.