Actor Harsha vardhan: పెళ్లి మీద విముఖత కలిగి ఉన్న అమ్మాయిలు కోట్లలో ఉన్నారని, ఆ కాన్సెప్ట్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారని సినీ నటుడు హర్ష వర్థన్ అన్నారు. నిజం చెప్పాలంటే ఆడ పుట్టుకంత ఘోరం ఇంకేం లేదని, ఈ మాటను తాను అత్యంత బాధతో కూడిన హృదయంతో చెప్తున్నానని ఆయన అన్నారు. అంతే కాకుండా పెళ్లి అనేది ఆడ పిల్లలకే చాలా అవసరమని, మగాళ్లకు కాదు అని, ఎందుకంటే పెళ్లి వద్దంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని ఆయన చెప్పారు. ఆడపిల్లకు బద్ద శత్రువులు ఆమె ఇంట్లో వాళ్లే అని, ఎందుకంటే పెళ్లికాని ఓ అమ్మాయి ఇంట్లో ఉంది అంటే భయపడతారని ఆయన చెప్పుకొచ్చారు.
అమ్మాయిల గురించి చాలా మాట్లాడతాం కదా, కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి చేసుకుంటదా, చేసుకోదా, లేదంటే ఎవరితోనైనా కలిసి ఉంటదా అని మాత్రం తెలుసుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. అబ్బాయిలు ఒక అమ్మాయితో తిరిగి కొన్ని రోజులయ్యాక బోర్ కొట్టి వేస్తారు. అలా అబ్బాయిలు చేయొచ్చు గానీ అమ్మాయిలు చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఒక అమ్మాయికి పెళ్లయి డివర్స్ కాగానే ఇంకొక అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారని, అసలేమాత్రం ఆలోచించకుండా ఆమెను పంపించేయాలని చూస్తారని ఆయన అన్నారు. కాబట్టి అమ్మాయిలకున్న అత్యంత పెద్ద శత్రువులు ఆమె తల్లిదండ్రులేనని ఆయన నొక్కి చెప్పారు.
ఆడపిల్లలకు ఇవన్నీ ఎదుర్కోవడానికి చాలా మనోధైర్యం ఉండాలని హర్ష వర్థన్ అన్నారు. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆ వేధింపులు వారికి ఇంకా ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు. ఈ మధ్య పుష్ప సినిమాలో వచ్చిన ఊ అంటావా… ఊఊ అంటావా పాటలో చెప్పినట్టు ఏదేదో చెప్తారు అని చెప్పేదంతా నిజమేనని ఆయన తెలిపారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే మాత్రం అమ్మాయిలకు ఇంకేం అక్కర్లేదని హర్ష చెప్పారు. దెబ్బ తినడం, ఫూల్ అవడం ఇవన్నీ ఆడ, మగా తేడా లేకుండా ఎవరికైనా జరుగుతాయని కానీ, కనీసం ఏడవడానికి కూడా కంఫర్ట్ లేకుండా వాళ్లను చేస్తున్నారని ఆయన అన్నారు.