వైఎస్ జగన్ మీద అంతా నెగెటివిటీయేనా.? ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేదా.?

అధికారం తమ చేతుల్లో వున్నప్పుడు, వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకోవడం అన్నది అన్ని రాజకీయ పార్టీలూ చేసే పనే.! అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. రాష్ట్రాల స్థాయిలో ప్రాంతీయ పార్టీలు కావొచ్చు.. ఎవరు చేసినా అదే పని.!

‘పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని మాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.?’ అని పదే పదే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. పోలీసు వ్యవస్థని టీడీపీ హయాంలో ఎలా వాడారో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే సాక్ష్యం.

సరే, రాజకీయ పార్టీలన్నాక రాజకీయ విమర్శలు మామూలే. ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీ, ‘మేం వస్తే వ్యవస్థలు స్వతంత్రంగా తమ పని తాము చేసుకునేలా చూస్తాం..’ అని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థల్ని ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చూస్తూనే వున్నాం. అది వేరే చర్చ.

ఇక్కడ, తెలుగు మీడియా గురించి ప్రస్తావించుకుంటే.. అసలు ఈ మీడియాకి ఏమైంది.? ఏపీ ఆర్థిక పరిస్థితి ఏ మీడియా సంస్థకు మాత్రం తెలియదు.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో ఏపీకి ఆర్థిక కష్టాలొచ్చాయ్. చంద్రబాబు హయాంలో ఆ కష్టాలు తగ్గలేదు సరికదా, ఇంకా పెరిగాయి. వైసీపీ హయాంలో ఇంకా ఇంకా పెరిగాయ్.

అయినా, వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా నడుస్తున్నాయ్ కదా. క్యాలెండర్ పెట్టుకుని మరీ సంక్షేమ పథకాల్ని క్రమం తప్పకుండా అమలు చేస్తోంది వైఎస్ జగన్ సర్కారు. నిత్యం వైసీపీ ప్రభుత్వం మీద విషం చిమ్మడం తప్ప, సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్క పాజిటివ్ న్యూస్ అయినా, సోకాల్డ్ యెల్లో మీడియాలో చూడగలమా.? ఇలాంటి మీడియా ఏపీకి అవసరమా.? అన్న చర్చ జరగడంలో తప్పేముంది.?