Online Dating: డేటింగ్ కి అడ్డాగా మారిన భాగ్యనగరం..

Online Dating: ఫోన్ చేతిలో ఉంటే చాలు .. ప్రపంచం అంత అరచేతుల్లో ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ తరం యువత. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రపంచం రూపు రేఖలే మారిపోయాయి. టెక్నాలజీ వలన ఒక వైపు మంచి జరుగుతుందని సంతోషించేలోపే అంతకు మించిన రెట్టింపు డామేజి మరోవైపు జరుగుతుంది.

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ విప్లవంతో ఏకంగా భారతదేశ కల్చరే మారిపోయింది. ప్రధానంగా చెప్పుకునే అంశం ఆన్ లైన్ డేటింగ్. దీనికోసం ఏకంగా ప్రత్యేకమైన అప్లికేషన్స్ కూడా ముందుకొచ్చాయి. వీటివల్ల డేటింగ్ సంస్కృతి అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు డేటింగ్ అనే పదం వింటేనే ఏదో తెలియని ఇబ్బంది ఉండేది. ఏదో పలకకూడని పదం పలికామే అనే ఆలోచన ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయాయి. మారుతున్న కాలంలో డేటింగ్ అనేది ఒక కల్చర్ లా మారిపోయింది.

ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఈ డేటింగ్ లో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైనది. ప్రముఖంగా వినిపించే డేటింగ్ యాప్ టిండర్స్ ఇయర్ ఇన్ స్వైప్ 2021 పేరుతో ఒక సర్వ్ నిర్వహించింది. ఇందులో తేలిన విషయం ఏంటంటే హైదరాబాద్ మొదటిస్థానం లో నిలిచింది అని. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, పూణే నగరాలు నిలిచాయి. 2021 జనవరి నుండి నవంబర్ 30 వరకు ఈ టిండర్ సంస్థ సర్వేని నిర్వహించింది. ముఖ్యంగా 18 నుండి 25 ఏళ్ళు వయసు ఉన్న వారి నుండి ఈ డేటా ని సేకరించారు.

అసలు డేటింగ్ ఈ స్థాయిలో పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటా అని ఆరాతీస్తే.. ప్రధాన కారణం కరోనా అని తేలింది. రెండేళ్లలో చాలా మంది ఒకరినొకరిని కలవలేకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వీడియో కాల్స్ ప్రధాన పాత్రని పోషించాయి. ఎక్కువ శాతం మంది తమ డేటింగ్ అంశాలన్నీ వీడియో కాల్ లోనే చేసారు. దానివలన వీడియో కాల్ వృద్ధిలో 52 శాతం సాధించినట్లు తెలిపింది ఆ సంస్థ. అలా డేటింగ్ కల్చర్ చాపకింద నీరులా విస్తరిస్తుంది.