One Nani Vs 3 Nanis : ఒక నాని సినిమాని అడ్డుకుంటే.. ముగ్గురు ‘నాని’ల పదవులు పోయాయ్.!

One Nani Vs 3 Nanis :  తన మంత్రి వర్గంలో ఎవర్ని వుంచుకోవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టం. రెండున్నరేళ్ళ తర్వాత 90 శాతం మంది మంత్రుల్ని మార్చేస్తానని తొలి మంత్రి వర్గ ఏర్పాటు సమయంలోనే వైఎస్ జగన్ చెప్పారు.

అయితే, మాటకు కట్టుబడి వుండలేకపోయారు. 11 మంది పాతవారికి మళ్ళీ అవకాశమిస్తూ, కొత్తగా 14 మందిని మాత్రమే తీసుకున్నారు కొత్త మంత్రి వర్గంలోకి.

ఇదిలా వుంటే, ఈ రాజకీయాన్ని సినిమాలకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సినీ నటుడు నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఏపీలో ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే.

సినిమా టిక్కెట్ల ధరలపై నాని మాట్లాడటంపై మండిపడుతూ వైసీపీకి చెందిన చాలామంది మంత్రులు, ఇతర ముఖ్య నేతలు తీవ్రంగా స్పందించారు.

‘నాని ఎవరు.?’ అంటూ అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నిస్తే, మరో మంత్రి పేర్ని నాని సహా పలువురు తీవ్రమైన విమర్శలు చేశారు. అలా విమర్శలు చేసినవారిలో కొడాలి నాని కూడా వున్నారు. ఆళ్ళ నాని స్పందించలేదనుకోండి.. అది వేరే వ్యవహారం.

అయితే, అనిల్ కుమార్ యాదవ్ సహా, మరో ముగ్గురు నానిలు మంత్రి పదవి కోల్పోయారు. నాని మీద విరుచుకుపడ్డ అనిల్ ఇప్పుడు ‘నిల్’ అయితే, ముగ్గురు నానిలు ఔట్ అయిపోయారంటూ సోషల్ మీడియాలో నాని అభిమానుల నుంచి సెటైర్లు పడుతున్నాయి.