YS Jagan’s Govt : ‘జప్తు’ వాహనాలు: ఇలాంటి చెత్త ఐడియాలెలా వస్తాయ్ చెప్మా.!

YS Jagan’s Govt : పన్నులు చెల్లించలేదా.? మీ వస్తువులు జప్తు చేయబడతాయ్.! ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల జప్తు వాహనాలు జనాల గుండెళ్ళో రైళ్ళు పరిగెత్తించేస్తున్నాయ్. అసలిలాంటి చెత్త ఐడియాలు ప్రభుత్వానికెలా వస్తాయ్.? అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.. ఆందోళన చెందుతున్నారు. సంక్షేమం అంటే ఇలాగే వుంటుంది మరి. సంక్షేమం పేరు చెప్పి అడ్డగోలుగా అప్పులు చేసేస్తోంటే, రాష్ట్ర ఖజానా ఏమైపోతుంది.? ఆ అప్పులకు వడ్డీలెలా చెల్లించేది.?

ఓ చేత్తో ఇవ్వడం, రెండు చేతుల్తో లాగేసుకోవడమే సంక్షేమం అంటే.. అని ఆంద్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయినా, జప్తు వాహనాలేంటి.? యజమానుల వస్తువుల్ని జప్తు చేయడమేంటి.? చాలా చిత్రమైన, చాలా చాలా చెత్త కాన్సెప్ట్ ఇది.. అన్నది మెజార్టీ అభిప్రాయం.

ప్రజలు పన్నులు కట్టకపోతే ప్రభుత్వాలెలా మనుగడ సాధిస్తాయ్.? అన్నది ఇంకో వాదన. అదీ నిజమే. ప్రజలు పన్నులు కడితేనే, ప్రభుత్వాలు నడుస్తాయ్. ఖజానా నిండాలి.. ఆ ఖజానాకి వచ్చే డబ్బులే మళ్ళీ జనం కోసం ఖర్చు చేయాలి. ఇదొక ‘సైకిల్’.!

సంక్షేమం పేరుతో జనాన్ని సోమరిపోతుల్లా మార్చేస్తే, ‘మేమెందుకు పన్నులు కట్టాలి.?’ అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. మొన్నామధ్య ఓటీఎస్ విషయమై కూడా జనం నుంచి ఇలాగే నిలదీతలు ఎదురయ్యాయి అధికారులకి. ఇప్పుడేమో, ‘జప్తు’ వాహనాలేసుకుని అధికారులు కావొచ్చు, సిబ్బంది కావొచ్చు.. జనం వద్దకు వెళితే ఛీత్కారాలు తప్పవు కదా.?

ఇవన్నీ వైసీపీకి ముందు ముందు కష్టాలు తెచ్చే కార్యక్రమాలే.