ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు ఉపఎన్నిక గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అన్ని ప్రధాన పార్టీలకు కీలకం అనే సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో బీజేపీ పార్టీ నేతలు కూల్ గా ఉండగా టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ నేతలు మాత్రం టెన్షన్ పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే మునుగోడు ఉపఎన్నిక వల్ల ప్రధాన పార్టీలకు ఊహించని షాక్ తగలనుందని బోగట్టా. ఈ ఉపఎన్నికకు 1000 నుంచి 1200 మంది నామినేషన్లు వేసే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికలలో పోటీ చేయడానికి సామాన్య ప్రజలు ఆసక్తి చూపరు. అయితే డిండీ ఎత్తిపోతల ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. ఇలా పరిహారం అందని వాళ్లు కుటుంబానికి ఒకరు చొప్పున నామినేషన్ వేయనున్నారని తెలుస్తోంది.
డిండీ ఎత్తిపోతల పథకంలో భాగంగా అయిదు రిజర్వాయర్లు నిర్మిస్తుండగా చర్లగూడెం, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ల పరిధిలో ఉన్నవాళ్లకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. వాళ్లు కుటుంబానికి ఒకరు చొప్పున పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. 1000 కంటే ఎక్కువమంది నామినేషన్లు వేస్తే ఎన్నికల సంఘం అంత మందికి గుర్తులను కేటాయించలేదు.
ఫలితంగా ఎన్నిక రద్దయ్యి మళ్లీ ఎన్నిక జరిగే పరిస్థితి అయితే ఏర్పడవచ్చు. ఎన్నిక రద్దై మళ్లీ ఎన్నిక జరిగితే ప్రధాన పార్టీలకు సైతం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పటివరకు 1996 ఎన్నికల్లో 485 మంది నామినేషన్లు వేయడం రికార్డ్ కాగా ఆ రికార్డ్ మునుగోడు ఉపఎన్నిక ద్వారా బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.