కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత తలుచుకుంటే రాష్ట్ర సర్కార్‌ను కూల్చేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యువతను ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని ఘాటు విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న హామీని విస్మరించిందని హాట్ కామెంట్స్ చేశారు. అలాగే గ్రూప్-1, గ్రూప్-2 పోటీ పరీక్షల ద్వారా యువతకు న్యాయం చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదన్నారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం కేవలం 50వేల నియామకాలు మాత్రమే చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే తమకు న్యాయం జరుగుతుందని యువత భావించి ఓట్లు వేసి గెలిపించిందన్నారు. కానీ సర్కార్ మాత్రం యువతను మోసం చేసిందని విమర్శించారు. గ్రూప్-1 పరీక్షల్లోఅవకతవకలు జరిగాయని.. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 30లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతకు తాను అండగా ఉంటానని.. నిరాశపడకుండా ఉండాలని భరోసా ఇచ్చారు.
యువతతో ఆడుకున్న ప్రభుత్వాలు ఏవి మనుగడ సాధించ లేదని సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేశారు. నేపాల్‌లో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇలాగే ఉద్యోగాల భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నేపాల్ తరహాలో యువత తిరగబడి ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమంటూ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఉద్యోగాల భర్తీలో యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.
కాగా కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఖాయమని ఆయన భావించారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను విమర్శిస్తున్నారు. తాజాగా యువత తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్ర ఈ ఆరోపణలపై కనీసం స్పందించలేదు. మరి ప్రభుత్వంపై నేరుగా విమర్శు చేసి ఆయనపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందా..లేక మౌనంగా ఉంటుందా వేచి చూడాలి.
