One Airport In Every District : జిల్లాకి ఓ విమానాశ్రయం సరే, ఏపీ రాజధాని సంగతేంటి.?

One Airport In Every District : ‘జిల్లాకో విమానాశ్రయం నిర్మించాలి..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎయిర్ కనెక్టివిటీని పెంచడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించడాన్ని తప్పు పట్టలేం.

రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్ని పెద్దయెత్తున నిర్మించడం, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం నడుం బిగించడం.. ఇవన్నీ ఆహ్వానించదగ్గ విషయాలే. కానీ, రాజధాని సంగతేంటి.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. ఎనిమిదేళ్ళయ్యాక కూడా రాష్ట్రానికి సరైన రాజధాని లేదంటే, పాలించిన అలాగే పాలిస్తున్న పాలకులకీ, ప్రజలకీ అది అవమానమే కదా.?

‘మూడు రాజధానుల కోసం కొత్త బిల్లుని త్వరలో తీసుకొస్తాం..’ అని వైఎస్ జగన్ సర్కారు చెప్పి రోజులు గడుస్తోంది.. నెలలు కూడా గడుస్తోంది. అదెప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. బిల్లు వచ్చినా, మూడు రాజధానులు సాధ్యమేనా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

మూడు సంగతి తర్వాత, ముందైతే ఒక్క రాజధానిని అయినా అభివృద్ధి చేసుకోవాలి కదా.? అన్నది సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోగతం. మొదట్లో మూడు రాజధానులకు విపక్షాలు అడ్డు తగులుతున్నాయన్న భావన ప్రజల్లోనూ వుండేది. ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లోనూ, మూడు రాజధానులపై పెద్దగా ఆశల్లేవు. అమరావతిని అడ్డుకునేందుకే మూడు రాజధానుల ఎజెండా అన్న భావన వైసీపీ శ్రేణుల్లోనూ బలపడిపోయింది.

రాజధాని లేని రాష్ట్రాన్ని ఊహించుకోవడం కష్టం. అది ఏ రాష్ట్ర ప్రజలకైనా అత్యంత అవమానకరమైన విషయం. అమరావతి రాజధానిగా ప్రస్తుతానికి వున్నప్పటికీ, దాన్ని అధికార పక్షమే గుర్తించని పరిస్థితి. ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు.?