Omicron Shock : దెబ్బ మీద దెబ్బ.. సంక్రాంతి సినిమాలకు కష్టమే.!

Omicron Shock :  దేశవ్యాప్తంగా రెండే రెండు సినిమాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఒకటి ‘ఆర్ఆర్ఆర్’, ఇంకోటి ‘రాధేశ్యామ్’. తమిళ సినిమా ‘వాలిమై’ కూడా సందడి చేయబోతోంది ఈ సంక్రాంతికే. అయితే, వాటికన్నా ఎక్కువ సందడి ఒమిక్రాన్ చేసేలా వుంది. ఒమిక్రాన్ దెబ్బకి పెద్ద సినిమాలన్నీ గల్లంతయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఢిల్లీ ప్రభుత్వం సినిమా థియేటర్లను మూసేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో ఆక్యుపెన్సీ తగ్గించారు. కర్నాటకలో కూడా అదే పరిస్థితి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వుండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో తొలి వేటు సినిమా థియేటర్ల మీదనే పడనుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రార్థనాలయాల్లోనూ ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంతకీ, ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ ఏమౌతాయ్.? పరిస్థితులు సక్రమంగా వుండి, సినిమా టిక్కెట్ల ధరలు కలిసొచ్చి, అదనపు షోలు నడిస్తేనే ఈ రెండు సినిమాలూ వసూళ్ళ పరంగా వర్కవుట్ అయ్యే అవకాశం వుంటుంది.

ఇప్పటికే చాలా నెలలుగా ఈ సినిమాలు వాయిదా పడుతూ పడుతూ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమయిన సంగతి తెలిసిందే.