బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రతిష్టాక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై అంచనాలు జాతీయ స్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ ఒక్కడితోనే వరల్డ్ రికార్డులు కొల్లగొట్టిన జక్కన్న ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు టాప్ స్టార్స్‌తో కలిసి సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాడు. టైం తీసుకున్నప్పటికీ ప్రేక్షకులు మెచ్చేలా తన సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్స్‌లోకి వచ్చి ఉండేంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై డీవీవీ దానయ్య 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.
రాజమౌళి ప్రమోషన్ స్టైల్ ఎవరికి అర్ధం కాని రీతిలో ఉంటుంది. బాహుబలి సినిమా సమయంలో అందులోని పాత్రలకు సంబంధించి పోస్టర్స్ విడుదల చేసి హైప్ పెంచిన జక్కన్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌కు కూడా అదే ప్లాన్ వర్కవుట్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. రీసెంట్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫొటోని షేర్ చేస్తూ అక్టోబర్ 13న చిత్రం రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. పోస్టర్‌ని చూసి ఫ్యాన్స్ మైమరచిపోయారు. లేట్ అయిన కూడా లేటెస్ట్ అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ థ్రిల్ చేస్తున్న రాజమౌళి ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటిస్తున్న ఒలీవియో మోరిస్ ఫస్ట్ లుక్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో ఆమె లుక్ అందరిని మెప్పించేలా ఉంది.
ఇంగ్లీష్ కథానాయికని రాజమౌళి ఎందుకు ఎంపిక చేశాడా అన్నది ఈ పోస్టర్‌తో ప్రేక్షకులకి క్లారిటీ వచ్చింది. బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి భీకర ఫైటింగ్ చేయనున్నారట. ఇది ప్రేక్షకులకు మంచి ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. ఈ మూవీలో అలియా భట్ కూడా కథానాయికగా నటిస్తుంది. అజయ్ దేవగణ్, శ్రియ, ఐరిష్ నటి అలిసన్ డూడీ, సముద్ర ఖని,ప్రఖ్యాత థార్ సిరీస్‌లో నటించిన రే స్టీవెన్సన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.