దళిత యువకుడికి గుండు చేయించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడికి గుండు కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి నూతన్ నాయుడు పరారీలో ఉన్నాడు.
ఈక్రమంలో ముంబైకి పారిపోతున్న నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వైజాగ్ సీపీ మనీశ్ కుమార్ సిన్హా వెల్లడించారు.
అయితే.. దళిత యువకుడికి గుండు చేయించడంలో నూతన్ నాయుడు పాత్ర ఉందని తెలిశాకనే అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇప్పటికే నూతన్ నాయుడు, ఆయన భార్య మధుప్రియతో పాటుగా మరో ఏడుగురిపై విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇఫ్పటికే కొందరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నూతన్ నాయుడు భార్యను కూడా అరెస్ట్ చేసినప్పటికీ.. నూతన్ నాయుడు మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో అతడిపై నిఘా వేసిన పోలీసులు ముంబై పారిపోతుండగా పట్టుకున్నారు.
నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే వ్యక్తి శ్రీకాంత్ కొన్ని రోజులు పనికి రాకపోవడంతో తమ సెల్ ఫోన్ పోయిందంటూ అతడిని ఇంటికి పిలిచి.. తన భార్య మధుప్రియ సూచన మేరకు నూతన్ నాయుడు ఆ యువకుడికి గుండు కొట్టించాడు. తన ఇంట్లోనే ఆ యువకుడికి గుండు కొట్టించడంతో పాటు.. అతడిని హింసించి.. సెల్ఫీలు తీసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.