దళిత జనం మీద జరిగిన వరుస దాడులు ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరొక దళిత యువకుడిపై దాడి జరిగింది. ఈ దాడిలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నూతన్ నాయుడు. బిగ్ బాస్ సీజన్ టూలో పాల్గొనడంతో నూతన్ నాయుడు పేరు పాపులర్ అయింది. షో ద్వారా మృదు స్వభావిగా పేరు తెచ్చుకున్నాడు నూతన్ నాయుడు. విశాఖలోని పెందుర్తిలో నూతన్ నాయుడు నివాసం ఉంటున్నారు. వారి ఇంట్లో పనిచేసే కర్రి శ్రీకాంత్ అనే దళిత యువకుడు ఆగష్టు నెలలో పని మానేశాడు. అయితే నిన్న శుక్రవారం నూతన్ నాయుడు భార్య శ్రీకాంత్ కు ఫోన్ చేసి సెల్ ఫోన్ పోయిందని ఆ విషయం మాట్లాడేందుకు ఇంటికి రమ్మని పిలిచారు.
ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ మీద ఆరోపణలు చేసి అక్కడే గుండు గీయించి, ఈ విషయం బయటకు చెప్పొద్దని బెదిరించారట. కానీ శ్రీకాంత్ ధైర్యం చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్ నందు పిర్యాధు చేశారు. బాధితుడి పిర్యాధు మేరకు నూతన్ నాయుడు భార్యతో సహా ఇంకో ముగ్గురి మీద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని ఇసుక అక్రమ రవాణా వాహనాలకు అడ్డుతగిలాడనే కారణంగా పోలీసులే స్టేషన్లో పెట్టి చితగ్గొట్టి శిరోముండనం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. సీఎం జగన్ నేరుగా కలుగజేసుకుని బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆ తర్వాత బాధిత యువకుడు తనకు న్యాయం జరగడం లేదని, తనకు మావోయిస్టుల్లో చేరడానికి అనుమతివ్వాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆ లేఖతో వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి స్పందించి బాధితుడికి న్యాయం జరగాలని ప్రత్యేక అధికారిని నియమించారు. ఇప్పుడే అదే తరహాలో మరొక దళిత యువకుడి మీద దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో నూతన్ నాయుడు ఇష్యూ తీవ్ర వివాదాన్ని రేపింది. కేసులో నూతన్ నాయుడు పాత్ర మీద లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. యువకుడి ఆరోపణలు నిజమైతే నూతన్ నాయుడు మీద, ఆయన భార్య మీద బలమైన చర్యలు తప్పవని అంటున్నారు. ఇక నూతన్ నాయుడుకి రాజకీయ నాయకులతో సంబధాలు ఉండటంతో విషయం రాజకీయ దుమారాన్ని రేపే అవకాశాలు కూడ లేకపోలేదు.