`బిగ్ బాస్` ఫేమ్ నూతన్ నాయుడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. ఆయన ఇంట్లో పనిచేసే దళితుడికి శిరోముండనం చేయించిన ఘటనలో నూతన్ పేరు మారు మ్రోగిపోతుంది. మరో వైపు వైజాగ్ పోలీసులు ఈ వివాదంలో వాస్తవాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైజాగ్ సన్నిహిత వర్గాల ప్రకారం నూతన్ నాయుడు ఈ వీడియోలో ఎక్కడా కనిపించలేదు. కేవలం ఆయన భార్య..ఇతర సిబ్బందే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ వివాదంలోకి రాజకీయ పార్టీలు కూడా దూరుతున్నట్లే కనిపిస్తోంది. నూతన్ నాయుడు ఒకప్పుడు వైసీపీ పార్టీ కోసం పనిచేసినట్లు చెప్పుకున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ సోదరుడైన అనీల్ రెడ్డి సూచన మేరకు ఆ పార్టీ ఎజెండా, రాజ్యాంగం రాసే పనిలో క్రియా శీలకంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ విధమైన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుందని అటున్నారు. కానీ ఆ వీడియో అయితే ఎక్కడా కానరాలేదు. అలాగే మరో వీడియోలో జనసేన కోసం పనిచేస్తున్నట్లు కూడా ఓ వార్త ఉదయమే వచ్చింది. ఆ వీడియో కూడా బయటకు వచ్చిందో లేదో తెలియదు గానీ! వచ్చినట్లు వార్తలైతే ఇబ్బడిముబ్బడిగా వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? నూతన్ నాయుడు ఏ పార్టీ? అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నాడా? జనసేనకు మద్దతినిస్తున్నాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి.
నూతన్ నాయుడు మెగా ఫ్యామిలీ ఫాలోవర్ అని, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు వీరాభిమాని అని ఇండస్ర్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. వర్మ తెరకెక్కించిన `పవర్ స్టార్` సినిమాకు కౌంటర్ గా `పరాన్న జీవి`ని కూడా తెరకెక్కించిన నేపథ్యంలో అతను పవన్ అభిమానిగా చెప్పుకుంటున్నారు. కానీ పొలిటికల్ గా వైసీపీకి మద్దతిస్తున్నట్లు పాత వీడియో క్లిప్పింగ్ లు చెబుతున్నాయి. దీంతో నూతన్ నాయుడు దారెటో కూడా తెలియని గందరగోళం నెలకొంది. దళిత యువకుడికి శిరోముండం జరిగినప్పుడు నూతన్ నాయుడు హైదరాబాద్ లో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు పాల్పడింది కేవలం అతని భార్య, ఆ ఇంట్లో పనిచేసే సిబ్బంది అనే అనే పెందుర్తి(వైజాగ్) సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. అలాగే నూతన్ నాయుడు స్థానికంగా పెద్ద బిజినెస్ మ్యాన్ అని కూడా సమాచారం. వాస్తవానికి నూతన్ నాయుడు ఓ కామన్ మ్యాన్ గా ఇండస్ర్టీలో ఫోకస్ అయ్యాడు. కానీ అతను బడా బాబు అని..విలాస వంతమైన జీవితాన్ని ఆస్వాదించే వాడని ఒక్కొక్కటిగా బయటకొస్తుంది.