యంగ్ టైగర్ ఎన్టీయార్ రాజకీయ రంగ ప్రవేశమెప్పుడు.? ఇప్పుడీ ప్రశ్న తెలుగు నాట గట్టిగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకీ అత్యంత దయనీయంగా మారుతున్న నేపథ్యంలో పార్టీ పగ్గాలు తీసుకోవాల్సిందిగా యంగ్ టైగర్ ఎన్టీయార్ మీద ఒత్తిడి పెరుగుతోన్న మాట వాస్తవం. అయితే, ఎన్టీయార్ మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా వున్న ఎన్టీయార్, రాజకీయాల్లోకి రావడం ద్వారా సినిమా కెరీర్‌ని పాడు చేసుకుంటాడా.?
అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే గేమ్ షో ప్రమోషన్ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన ఎన్టీయార్, ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు.?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి రావడంతో, కొంత తటపటాయించాల్సి వచ్చింది. ‘ఈ ప్రశ్నకు సమాధానం మీకే తెలుసు. ఇది సమయమూ కాదు, సందర్భమూ కాదు. మనం, ఈ విషయమ్మీద ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం తీరిగ్గా..’ అనేశాడు. ‘మీ కోసం రెండు తెలుగు రాష్ట్రాలూ ఎదురుచూస్తున్నాయి..’ అనగానే, యంగ్ టైగర్ ఎన్టీయార్‌లో వెయ్యి ఓల్టుల ఎనర్జీ కనిపించిందనే భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అయితే, ఎన్టీయార్ మాత్రం, అస్సలేమాత్రం తొందరపడలేదు, కూల్‌గా సమాధానమిచ్చేందుకు ప్రశ్నించాడు. తెలంగాణలో సంగతెలా వున్నా, ఆంధ్రపదేశ్‌లో మాత్రం, టీడీపీ శ్రేణుల్లో చాలామంది ఎన్టీయార్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. చాలాకాలం క్రిందట యంగ్ టైగర్, తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల ప్రచారంలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, కొన్నాళ్ళు మంచానికి పరిమితమైతే, ఆ పరిస్థితుల్లో కూడా టీడీపీ తరఫున ప్రచారం కోసం కష్టపడ్డ కమిట్‌మెంట్ కలిగిన నేచర్ ఎన్టీయార్‌ది. ఇప్పుడు సినీ నటుడిగా అందరివాడనిపించుకుంటున్న యంగ్ టైగర్, రాజకీయాల్లోకి వచ్చి కొందరివాడైపోయేందుకు సిద్ధపడతాడా.?