అభిమానుల్ని మోటివేట్ చేస్తున్న ఎన్టీఆర్

ntr motivates his fans
ntr motivates his fans
జూనియర్ ఎన్టీఆర్ కొన్నిరోజుల క్రితం కరోనాకు గురయ్యారు.  ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.  అభిమానులంతా తారక్ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.  ఇదిలా ఉంటే రేపు మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు.  ప్రతి ఏటా ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజును ఘనంగా జరువుకుంటూ ఉంటారు. కేక్ కటింగ్స్, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పలు ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అలా చేయడానికి వీల్లేదని అంటున్నారు తారక్.  ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో కేసులు వస్తున్నాయి.  
 

ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలు పెట్టాయి. ప్రజల్ని ఇళ్లలోనే ఉండి సహకరించమంటున్నాయి. అందుకే తారక్ తన పుట్టినరోజని ఎలాంటి వేడుకలూ చేయవద్దని అంటున్నారు.  మీరు నా పుట్టినరోజునాడు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలను ఒక ఆశీర్వచనంగా భావిస్తానన్న తారక్ ఈ సంవత్సరం మాత్రం ఎలాంటి వేడుకలూ వద్దని ఇంటిపట్టునే ఉంటూ లాక్ డౌన్ నిబంధనలు పాటించమని అదే మీరు నాకిచ్చే అతిపెద్ద బహుమతని అన్నారు. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతరులకు సంఘీభావం తెలిపాలని, వీలైతే ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయమని మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు.