చంద్రబాబుకి యంగ్ టైగర్ అభిమానుల తలనొప్పి.!

‘మా యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదు.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని, ఆ యంగ్ టైగర్ అభిమానులు నిలదీస్తున్నారు. ‘ఇదేం పద్ధతిగా లేదు చంద్రబాబుగారూ..’ అటూ టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలు కూడా అధినేతని ట్యాగ్ చేస్తూ ట్వీట్లేస్తుండడం గమనార్హం.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పుట్టినరోజు నేపథ్యంలో ఆయా సందర్భాల్లో చంద్రబాబు ట్వీట్లేస్తుంటారు. కానీ, యంగ్ టైగర్ విషయంలో చంద్రబాబు ‘వాడుకుని వదిలేసే రాజకీయాలు’ చేస్తుండడాన్ని సహజంగానే ఆ యంగ్ టైగర్ అభిమానులు తీవ్రంగా పరిగణిస్తుంటారు. ఇప్పుడూ అదే జరుగుతోంది.

‘మర్యాదగా మా అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతావా.? లేదా.?’ అని చంద్రబాబుని ఎన్టీయార్ అభిమానులు డిమాండ్ చేసేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ‘ఎన్టీయార్ కుటుంబ సభ్యుడే గనుక, పర్సనల్‌గా విషెస్ చెప్పి వుంటారు..’ అంటూ కొందరు నందమూరి అభిమానులు కవర్ డ్రైవ్‌లు వేస్తున్నారు. యంగ్ టైగర్ అభిమానుల నుంచి ఈ రచ్చ జరుగుతుందని తెలిసీ, చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదన్నది ఆసక్తికరమైన అంశం.

పార్టీకి చెందిన నేతల మీద ఈ రోజు చంద్రబాబు పలు ట్వీట్లేశారు. మరి, ఎన్టీయార్ విషయంలో ఎందుకు విషెస్ చెప్పడంలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. యంగ్ టైగర్ అభిమానులు, టీడీపీకి కొరకరాని కొయ్యలా తయారైన దరిమిలా, వారిని చంద్రబాబు లైట్ తీసుకుంటున్నారని అనుకోవాలేమో. 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేస్తూ, ఎన్టీయార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పట్లో ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నాడు ఎన్టీయార్.
‘ఆ విశ్వాసం కూడా టీడీపీకి లేదు’ అనే ఆవేదన యంగ్ టైగర్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.