NTR – Krishna: నటరత్న ఎన్టీఆర్ మరియు నటశేఖర కృష్ణ మధ్య సంక్రాంతి ఫైట్ 1968లో మొదలైంది. ఆ ఏడాది ఎన్టీఆర్ నటించిన ఉమా చండీ గౌరీ శంకరుల కథా చిత్రం జనవరి 11న విడుదలైంది. పౌరాణికంగా ప్రారంభమై జానపద ధోరణిలో సాగిన ఈ సినిమాకు కె.వి.రెడ్డి దర్శకుడు. విజయ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ శివుడుగా జైశంకర్‌గా నటించారు. ఆయన శివుడిగా నటించిన రెండు సినిమాల్లో ఇదొకటి. ఉమా, చండీ, గౌరీ పాత్రలను సరోజాదేవీ పోషించారు.
ఇకపోతే హీరో కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రం జనవరి 12న రిలీజైంది. యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో కె. ఆర్. విజయ కథానాయికగా నటించారు. అల్లూరి సీతారామరాజు పాత్రను తొలిసారిగా ఈ చిత్రంలోనే కృష్ణ పోషించారు. నటుడు నెల్లూరు కాంతారావు నిర్మించిన ఈ చిత్రానికి వి. రామచంద్రరావు దర్శకత్వం వహించారు. సంక్రాంతికి తన సినిమా విడుదల చేయమని కాంతారావు నిర్ణయించినపుడు చాలా మంది ఆయన్ని భయపెట్టారు. సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమా వస్తుందు. అది విజయ వాళ్ల సినిమా. దర్శకుడు కె.వి. రెడ్డి. అంతటి పెద్ద సినిమాతో పోటీ పడతావా ? నీ పని అయిపోయినట్టే అని. అయినా కూడా కాంతారావు వినిపించుకోకుండా జనవరి 12న అసాధ్యుడు చిత్రాన్ని రిలీజ్ చేశారు.
ఆ తర్వాత ఎవ్వరూ ఊహించనివిధంగా ఉమా చండీ గౌరీ శంకర చిత్రం ఫ్లాప్ అయింది. అసాధ్యుడు హిట్ అయింది. ఈ సినిమా విజయంతో హీరో కృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ మొదలైంది. 1973లో మళ్లీ వీళ్లిద్దరి మధ్యే సంక్రాంతి సోలో ఫైట్ జరిగింది. ఎన్టీఆర్ నటించిన డబ్బుకు లోకం దాసోహం అనే చిత్రం జనవరి 12న, కృష్ణ నటించిన కౌ బాయ్ చిత్రం, మంచి వాళ్లకు మంచివాడు జనవరి 13న విడుదలయ్యాయి. నిజానికి ఆ సమయానికి చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉన్నా ప్రత్యేక ఆంధ్రా ఉద్యమం కారణంగా అన్నీ ఆగిపోయాయి. కానీ ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు మాత్రమే అప్పుడు రిస్క్ తీసుకొని విడుదల చేశారు. ఇకపోతే మంచివాళ్లకు మంచివాడు సినిమాకు వచ్చిన మొదటిరోజు కలెక్షన్లను ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కృష్ణ విరాళంగా ఇచ్చారు. మొత్తానికి మాత్రం 1973 సంక్రాంతి విజేత ఎన్టీఆరే నిలిచారు.