వైసీపీ నామినేటెడ్ పదవుల జాతర: రాంగ్ టైమింగ్.!

నామినేటెడ్ పదవుల భర్తీ అనేది ఏ ప్రభుత్వానికైనా అంత తేలికైన వ్యవహారం కాదు. అధికారంలోకి వచ్చే క్రమంలో చాలామంది నాయకులకు చాలా చాలా హామీలు ఇవ్వాల్సి వస్తుంది. వాటిని నెరవేర్చుకోవడానికి నానా తంటాలూ పడాల్సి వస్తుంది. అధికార వైసీపీ, ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై పెద్ద కసరత్తే చేసి.. తాజాగా అధికార ప్రకటన వెల్లడించింది. కొందరు ప్రభుత్వానికి సలహాదారులుగానూ.. కొందరు ఆయా సంస్థలకు ఛైర్మన్లుగానూ నియమితులయ్యారు. వీటిని ప్రభుత్వ ఉద్యోగాలని అనలేంగానీ, అంతకు మించిన స్థాయిలో వేతనాలు, గౌరవాలు దక్కే పదవులూ వాటిల్లో చాలానే వుంటాయి. అందుకే, వాటికి అంత క్రేజ్.

ఇక, ఇటీవల వైసీపీ సర్కార్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నవ్వులపాలైన మాట వాస్తవం. నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండర్ పట్ల తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఎంతవరకు సమంజసం.? అన్నది అధికార పార్టీ ముఖ్యులు, ప్రభుత్వ పెద్దలు ఆలోచించినట్టు లేరు. ‘నామినేటెడ్ పోస్టులంటూ లేని పదవుల్ని సృష్టించి మరీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారే.. మరి, నిజమైన నిరుద్యోగులకు మీరిస్తామన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడంలేదు.?’ అన్న ప్రశ్న విపక్షాల నుంచి దూసుకొస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇలా అన్ని పార్టీల నుంచి వస్తోన్న ఈ ప్రశ్నలకు అదనంగా, నిరుద్యోగుల విమర్శనాస్త్రాలు మరింత పవర్ జోడిస్తున్నాయి. అధికార పార్టీ సహజంగానే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేదు. ఆ మాటకొస్తే, అధికారంలో ఎవరున్నా.. సమాధానం చెప్పుకోలేని పరిస్థితే వుంటుంది. అందుకే, తగిన సమయం కోసం ఎదురుచూస్తారు. వైసీపీలో ఎందుకో టైమింగ్ మిస్సయినట్లు కనిపిస్తోంది.