నోబిల్ బహుమతి కావాలా.. నీకు అంత సీను లేదు.. ట్రంప్ ని పట్టించుకోని కమిటీ..!

ప్రపంచం అంతా ఎదురుచూసిన 2025 నోబెల్ శాంతి బహుమతి చివరకు వెనెజువెలా ప్రజాస్వామ్య పోరాటానికి చిహ్నంగా నిలిచిన.. Maria Corina Machadoకు దక్కింది. ఈ ప్రకటన వెలువడకముందే నోబెల్ అవార్డు చుట్టూ పెద్ద చర్చ నెలకొంది. కారణం అమెరికా అధ్యక్షుడు Donald Trump పదే పదే ఈ బహుమతి తనకే రావాలని బహిరంగంగా డిమాండ్ చేయడమే. తాను ఏడు యుద్ధాలు ఆపానని.. ఇంకా ఒకదాన్ని ఆపబోతున్నాని.. బహిరంగ వేదికలపై పదే పదే చెబుతున్నారు.

అయితే నోబెల్ కమిటీ మాత్రం రాజకీయ డిమాండ్లకు లొంగలేదు. వెనెజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడిన మచాడో కృషిని గుర్తించి ఆమెకే బహుమతి ప్రకటించింది. ప్రజాస్వామ్యానికి మార్గం సుగమం చేయడంలో ఆమె కీలక పాత్ర వహించిందని కమిటీ పేర్కొంది.
ట్రంప్ వైపు చూస్తే… 2025 మొత్తం ఆయన ఈ అవార్డు తనకే రావాలని పదే పదే వాదించారు. ఇజ్రాయెల్–ఇరాన్, భారత్–పాకిస్తాన్, ఈజిప్ట్–ఇథియోపియా వంటి ఎనిమిది అంతర్జాతీయ వివాదాలను తాను ముగించానని, గాజా యుద్ధానికి కూడా పరిష్కారం చూపానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరూ ఇంత చేయలేదని.. తనకు అవార్డు ఇవ్వకపోవడం అన్యాయం అని ట్రంప్ మళ్లీ మళ్లీ వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరిలో Benjamin Netanyahuతో భేటీ అనంతరం ఆయన తనకు నోబెల్ శాంతి బహుమతి ఇప్పటికే ఇవ్వాలని.. ఆ అర్హత తనకు ఉందని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పలు సమావేశాల్లో ఏడు యుద్ధాలు ముగించాను అంటూ ఘోషించారు. చివరికి అక్టోబరులో నోబెల్ ప్రకటించే ముందు ఇది నాకు ఇవ్వకపోతే అమెరికాకు అవమానం అన్నారు. ట్రంప్ పేర్కొన్న ఎనిమిది యుద్ధాలు లో భారత్–పాకిస్తాన్ వివాదం, రువాండా–డిఆర్సీ, ఇజ్రాయెల్–ఇరాన్, థాయిలాండ్–కంబోడియా వంటి కొన్ని వాదనలు వాస్తవత తప్పుగా తేలాయి. గాజా యుద్ధం విషయంలో ఆయన మధ్యవర్తిత్వం బందీల విడుదల దశలో మాత్రమే ఉన్నప్పటికీ దాన్ని కూడా తాను యుద్ధం ముగించానని చెప్పుకొచ్చారు.

మచాడోకు ఈ అవార్డుతో లాటిన్ అమెరికాలో ప్రజాస్వామ్య ఉద్యమాలకు కొత్త ఊపు వచ్చింది. వెనెజువెలాలో ఆమె నిర్భయంగా సాగించిన ఉద్యమం దేశానికి ప్రజాస్వామ్య మార్పు తెచ్చే దిశగా కీలక మలుపుగా చూడబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం శాంతియుతంగా పోరాడే వారికి ఇది ప్రేరణ అని అంతర్జాతీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వాదనలు బహుమతి ప్రకటన తర్వాత మరింత చర్చకు దారితీశాయి. నోబెల్ చరిత్రలో అమెరికా అధ్యక్షులు ఇప్పటికే ఈ బహుమతి అందుకున్నారు.. Barack Obama 2009లో, Jimmy Carter 2002లో, Woodrow Wilson 1919లో. ఈ జాబితాలో ట్రంప్ కూడా చేరతానని ఆయన భావించినా, 2025లో మచాడో దాన్ని దక్కించుకున్నారు.