ఆంధ్రపదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తుందా.? దేవుడు దిగొచ్చి ఆదేశించినాసరే, కేంద్రం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదు.! పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదాకి నరేంద్ర మోడీ ప్రభుత్వమే పాతరేసింది.
14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలంటారు.. నీతి అయోగ్ అంటారు.. అసలు చట్టంలో ఆ అంశం పెట్టలేదు గనుక ఇచ్చేది లేదంటారు.. ఆంధ్రపదేశ్‌లో గతంలో అధికారంలో వున్న చంద్రబాబు సర్కార్ రాజీపడ్డం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరలేదంటారు.. ఒక్క ప్రత్యేక హోదా చుట్టూ ఇంత నీఛ నికృష్ట రాజకీయమా.? అని ఎవరైనా నివ్వెర పోవాల్సిందే. ఒకే ఒక్క సంతకం.. ప్రధాని నరేంద్ర మోడీ పెట్టేస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేస్తుంది. పెద్ద నోట్ల రద్దు కూడా ఓ మాటతోనే జరిగిపోయింది.. దేశం కనీ వినీ ఎరుగని రీతిలో లాక్ డౌన్ మోడ్‌లోకి వెళ్ళిందీ ఒకే ఒక్క మాటతో.
మరి, ప్రత్యేక హోదా ఎందుకు రాదు.? అంటే, రాష్ట్రం పట్ల కేంద్రంలో అధికారంలో వున్నవారికి నిర్లక్ష్యం కాబట్టే. ‘రాష్ట్రానికి అన్నీ ఇచ్చేశాం..’ అని గతలో కేంద్రం చెబితే, ‘ఇంతకన్నా గొప్పగా రాష్ట్రం, కేంద్రం నుంచి ఏం సాధించగలదు.?’ అని గత చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ‘కేంద్రంతో సఖ్యతగా వున్నాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథలోకి తీసుకెళుతున్నాం..’ అని ప్రస్తుత జగన్ ప్రభుత్వం కూడా చెబుతోంది. మరి, కేంద్రం ఎలా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుంది.? అడిగేవారు మారుతున్నారు.. సమాధానం చెప్పేవారు మారుతున్నారు. ప్రశ్న అదే, సమాధానమూ అదే.
ఏళ్ళు గడుస్తున్నాయ్.. ఆంద్రపదేశ్ అనే రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరం జరిగిపోతోంది.. అప్పులు పెరిగిపోతున్నాయి. రాజధాని కూడా లేదాయె.! ప్రత్యేక హోదా వస్తే కాస్తో కూస్తో విభజన గాయాల నుంచి తేరుకోడానికి ఆస్కారముంటుంది. కానీ, ఆంధ్రపదేశ్ అనే రాష్ట్రం.. దేశంలో అంతర్భాగమేనని కేంద్రం భావించడంలేదేమో.. అందుకే, ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతోందేమో.!