తెలంగాణలో ఇప్పుడు టీ కాంగ్రెస్ పీసీసీ పదవి ఎవరికి దక్కుతుందా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణ లో బలమైన లీడర్ కి పీసీసీ పదవి కట్టబెట్టాలని చాలాకాలంగా వెయిట్ చేస్తోంది. సరైన లీడర్లు లేకపోవడంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిన క్యాడర్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఆ స్థానాన్ని భర్తీ చేయాలని యోచిస్తోంది. దీనిలో బాగంగా టీ కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు సొంత ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. అదిష్టానం మెప్పుకోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి తోచిన వేలో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓ ఇంటర్వూలో కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తనకు తానుగానే నాదే ఆపదవి అంటూ…నేనే పీసీసీ లీడర్ అంటూ ఇంటర్వూల్లో బాహాటంగా ప్రకటించుకుంటున్నారు.
నిజంగా ఆ పదవి తనకిస్తే తెలంగాణ లో కాంగ్రెస్ సత్తా ఏంటో చాటి చూపిస్తానని అన్నారు. ఇంకా పలువురు సీనియర్ నేతలు ఈ రేసులో ఉన్నారు. అయితే మల్కాజ్ గిరి ఎంపీ, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు. దీంతో అసలు ఆయన పీసీసీ రేసులో ఉన్నారా? లేదా? అనుమానం కాంగ్రెస ఫాలోవర్స్ కి కల్గుతోంది. అయితే పార్టీ నేతల్లో మాత్రం రేవంత్ వెనుకబడటానికి కారణాలు విశ్లేషించుకున్నట్లు తెలిసింది. టీడీపీలో చాలా కాలం క్రీయాశీలకంగా వ్యవహరించిన రేవంత్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి టీఆర్ ఎస్ కి పోటీగా బరిలోకి దిగాయి. ఇందులో రేవంత్ కీలక పాత్ర ఉందన్నది వాస్తవం. ఆ తర్వాత టీడీపీని కాంగ్రెస్ పక్కనబెట్టింది.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ ఎవరికి వారు విడిగా పోటీ చేసారు. అయితే వీటితో సంబంధం లేకుండా రేవంత్ టీడీపీతో మంచి రిలేషన్ ని నేటికి కొనసాగిస్తున్నారని కొంతమంది అనుమానంతో అదిష్టానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రేవంత్ కి పదవి కట్టబెడితే చంద్రబాబు స్వలాభాల కోసం వాడుకునే అవకాశం లేకపోలేదని ఆరోపించారుట. ఇది తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కే ప్రమాదమని భావించి అదిష్టానం రేవంత్ ని దూరం పెట్టనట్లు సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబుతో సాన్నిహిత్యం రేవంత్ ని వంద అడుగుల దూరంలో పెట్టిందన్నమాట.