విశాఖ రైల్వే జోన్ పాయె.! వాట్ నెక్స్‌ట్.?

ఇందులో వింతేముంది.? విశాఖ రైల్వే జోన్ ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు. గతంలో ఏదో మొహమాటానికి అన్నట్లు కొత్త రైల్వే జోన్ ప్రకటన కేంద్రం నుంచి వచ్చిందిగానీ, ఏళ్ళు గడుస్తున్నా అది ముందుకు కదలడంలేదంటేనే దానర్థం.. కేంద్రానికి ఇష్టం లేదని.!

రైల్వే జోన్ అనేది కేవలం రాజకీయ పరమైన నిర్ణయమే. గతంలో చాలా రైల్వే జోన్లు రాజకీయ నిర్ణయాలతోనే ఏర్పడ్డాయి. అదేంటో, ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు వుండవు. తెలుగు రాష్ట్రాలకి, అందునా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి అర్థం పర్థం లేని వాదనలు తెరపైకొస్తాయ్.. దేన్ని ఎగ్గొట్టడానికైనా ఇదే తంతు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం.. దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోం.. అని కేంద్రం గతంలోనే ప్రకటించింది. కానీ, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా పేరుతో రాజకీయం చేస్తూనే వుంది. ఏపీకి వచ్చేసరికి బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతుంటారు.

ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చేశాం.. అని విశాఖ వేదికగా గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇప్పుడేమో, రైల్వే శాఖ.. ఆ రైల్వే జోన్ వల్ల లాభం లేదంటోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడం కుదరదని పేర్కొంది. ఈ ఒక్క కుంటి సాకు చాలు, రైల్వే జోన్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి.

వాస్తవానికి ప్రత్యేక హోదా విషయంలోనూ ఇలాగే జరిగింది. మన్మోహన్ సర్కార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేసినట్లే. దాన్ని అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుంటిసాకులు వెతుక్కుంది.

కేంద్రమిలా డ్రామాలు ఆడుతోంటే, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి.? కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయ్.!