No Pre Polls In Telangana : ముందస్తు ఎన్నికల్లేవ్: కేసీయార్‌ని నమ్మగలమా.?

No Pre Polls In Telangana

No Pre Polls In Telangana : తెలంగాణలో ఈసారి ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేసేశారు. 2014 ఎన్నికల్లో (అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు.. రాష్ట్రం విడిపోయినాగానీ ఉమ్మడి ఎన్నికలే జరిగాయ్..) గులాబీ పార్టీ బంపర్ విక్టరీ కొట్టి, తెలంగాణలో అధికార పీటమెక్కిన విషయం విదితమే.

అయితే, 2019లో ఎన్నికలు జరగాల్సి వుండగా, 2018 చివర్లో కేసీయార్, ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు.. బంపర్ విక్టరీ ఇంకోసారి అందుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్ళీ 2023 చివర్లో ఎన్నికలు తెలంగాణలో జరగాల్సి వుంది. కానీ, 2022 చివర్లోనో లేదంటే, 2023 మొదట్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది.

ముందస్తు ఎన్నికల దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, టీఆర్ఎస్ శ్రేణుల్నీ, తెలంగాణ ప్రజల్నీ అప్రమత్తం చేస్తున్నారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎప్పుుడో ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల కోసం కేసీయార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని ఇప్పుడే రంగంలోకి దించారని ఎలా అనుకోగలం.?

కేసీయార్ లక్ష్యాలు చాలా పెద్దవి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో తమ అధికారం పదిలంగా వుండాలి. అందుకే, కాస్త ముందుగా.. అంటే, 2022 చివర్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్నది కేసీయార్ యోచనగా కనిపిస్తోంది.

అబ్బే.. అదేం లేదని కేసీయార్ ముందస్తు ఎన్నికలపై లైట్ తీసుకున్న విషయాన్ని అంతలా నమ్మేయలేం. ఎందుకంటే, కేసీయార్ లెక్కలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్.!