ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం.. అన్నాడట వెనకటికి ఒకడు. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ పార్టీల మధ్య పొత్తుల పంచాయితీ ఇంకా నడుస్తూనే వుంది. ఇప్పటికైతే బీజేపీ – జనసేన మధ్య పొత్తు కూడా గందరగోళంగానే కొనసాగుతోంది. ఇంకోపక్క టీడీపీ ఈ కూటమిలోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా మూడు ఆప్షన్స్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో, జనసేన ఒంటరిగా వెళ్లడం, జనసేన బీజేపీతో కలవడం, జనసేన బీజేపీతోపాటు తెలుగుదేశం పార్టీతోనూ కలవడం అనేవి వున్నాయి.
పొత్తు కుదిరితే, అధికారాన్ని పంచుకోవడం అనే అంశం తెరపైకొస్తుంది. కానీ, అలా జరగాలంటే, ముందు ‘కూటమిగా’ విజయం సాధించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే, అధికార వైసీపీని ఢీ కొట్టడం, విపక్ష కూటమికి అంత తేలిక కాదు.
‘ఆ మూడు పార్టీలు కలిస్తే, మాకు 175 సీట్లు వస్తాయ్..’ అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్న దరిమిలా, జనసేన పార్టీ కావొచ్చు, టీడీపీ కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. ఇంకాస్త వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి తప్ప, అడ్డగోలు ప్రకటనలు చేస్తే ఎలా.?
జనసేన నేత శాంతి ప్రసాద్ అయితే, ‘అధికారం పంచుకోవడం అసాద్యం..’ అనేస్తున్నారు. ఐదేళ్ళూ పవన్ కళ్యాణే ముఖ్యమంత్రిగా వుంటారనీ కుండబద్దలుగొట్టేస్తున్నారు. మరోపక్క టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే, ‘క్వింటా కొలతలో కొన్ని వడ్లు అవసరమవుతాయ్..’ అంటూ జనసేన పార్టీని ‘కొన్ని వడ్లుగా’ పేర్కొనడం గమనించాల్సిన విషయం.
ఇవన్నీ ఇలా వుంటే, జనసేన – బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ని ప్రకటించాలనే స్థాయికి జనసేన నేతలు దేబిరిస్తుండడం ఇంకో ఆసక్తికర అంశం.