మాయదారి కరోనా వచ్చి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసింది. కరోనా వల్ల దెబ్బతినని రంగమే లేదు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చేతిలో పనిలేక.. జేబులో చిల్లిగవ్వ లేక ఎన్నో అవస్తలు పడుతున్నారు జనాలు. రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గడం లేదు.
కరోనా దెబ్బ విద్యా వ్యవస్థ మీద కూడా పడింది. కరోనా వల్ల విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కొన్ని తెరుచుకుంటున్నాయి.. అయినా కూడా స్కూళ్లకు వెళ్లాలంటేనే విద్యార్థులు జంకుతున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం స్కూల్ కు వెళ్లకుండానే పదో తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతించేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.
పాఠశాలతో సంబంధం లేకుండా.. పాఠశాలకు వెళ్లకున్నా… ఇంటి వద్ద ఉండి చదువుకున్నా… ఫీజు చెల్లించి హాల్ టికెట్ పొందే వెసులుబాటును ఈ విద్యా సంవత్సరం నుంచే ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.
అంటే.. కరోనా వల్ల ఈ సంవత్సరం స్కూల్ లో జాయిన్ కాకున్నా.. స్కూల్ కు వెళ్లలేకపోయినా కూడా పరీక్షలు రాయొచ్చన్నమాట. ప్రస్తుతం ప్రభుత్వమే టీవీల్లో ఆన్ లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు ఇంట్లోనే ఉండి చదువు నేర్చుకొని డైరెక్ట్ గా ఎస్ఎస్సీ బోర్డుకు ఫీజు చెల్లించి హాల్ టికెట్ పొంది పరీక్షలు రాసే వీలును కల్పించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అన్ని వర్గాల అభిప్రాయం సేకరించి.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈసంవత్సరమే ఆ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ విధానం వస్తే నిజంగా పదో తరగతి విద్యార్థులకు ఇది గుడ్ న్యూసే అవుతుంది.