పదవ తరగతి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఏపీ ప్రభుత్వం

పదవ తరగతి పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పొరుగు రాష్ట్రాలన్నీ కరోనా భయంతో పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తే ఏపీ సర్కార్ మాత్రం పరీక్షలు జరపాల్సిందేనని పట్టుబట్టుకుని కూర్చుంది.  జూలై 10 నుండి 15 వరకు పరీక్షలు జరపాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుని విద్యార్థుల్ని, తల్లిదండ్రులను మానసికంగా సన్నద్దం కావాలని సూచించింది.  ఈ నిర్ణయం పట్ల మెజారిటీ తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
దేశంలో, రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో విజృభిస్తోందో అందరికీ తెలుసు.  జనమంతా రోజువారీ జీవితాన్ని పక్కనబెట్టి ఎంత కష్టమైనా ఇళ్లకే పరిమితమయ్యారు.  వైరస్ ఎటు నుండి సోకుతుందోనని బిక్కు బిక్కు మంటున్నారు.  ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం అంటే విద్యార్థులు, తల్లిదండ్రుల ఆరోగ్యాలను ఆపదలోకి నెట్టడమే అవుతుంది.  శానిటైజేషన్, భౌతిక దూరం అంటూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకదంనే గ్యారెంటీ లేదు.  ప్రభుత్వం కూడా ఒక్క విద్యార్థికి కూడా వైరస్ సోకకుండా చూస్తామని గ్యారెంటీ ఇవ్వలేదు. 
 
కానీ పరీక్షలకు సన్నద్దం కావాలని చెబుతోంది.  అసలు లాక్ డౌన్ కు ముందే పదో తరగతి పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది.  మొదట మార్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు పరీక్షల షెడ్యూల్ ఇచ్చారు.  కానీ స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే తోందరలో పరీక్షలను ఎప్రిల్ నెలకు వాయిదా వేశారు.  కానీ సడన్ లాక్ డౌన్ కారణంగా ఎన్నికలు, పరీక్షలు ఏవీ జరగలేదు.  ఇప్పుడు స్వయంగా హైకోర్టులే పరీక్షల పేరుతో పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టలేమని తేల్చి చెప్పాయి.  కానీ ఏపీ సర్కార్ మాత్రం పరీక్షలు జరపడానికే మొగ్గుచపుతోంది.  దీంతో తల్లిదండ్రులు ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడుకుంటోందని వాపోతున్నారు.