తెలుగుదేశం పరిస్థితి ఏంటయ్యా అని ఎవరినడిగినా వచ్చే ఏకైక సమాధానం లీడర్లు లేరు అనే. ఇక్కడ లీడర్లు అంటే ఎన్నో ఏళ్ళుగ్గా పార్టీని పట్టుకుని వేలాడుతున్నవారు కాదు. శ్రేణులను అన్ని విధాలా ముందుకు నడపగలిగిన వ్యక్తులు. సీనియారిటీయే నాయకత్వానికి ప్రథమ సూచిక అనుకుంటే టీడీపీలో చంద్రబాబు సహా తలపండిపోయిన లీడర్లు చాలామందే ఉన్నారు. కానీ ఏం లాభం.. వాళ్లంతా ఏదో మొక్కుబడి రాజకీయం చేస్తున్నారే తప్ప చెప్పుకోదగిన రీతిలో పార్టీని ముందుకు తీసుకెళ్లట్లేదు. ఈ మాట వేరే ఎవరో చెబుతున్నది కాదు.. స్వయంగా తెలుగుదేశం కార్యకర్తలు చెబుతున్నదే.
ఓటమిపాలై ఏడాది గడుస్తున్నా పార్లమెంటరీ అధ్యక్ష పదవులు క్రియేట్ చేయడం మినహా వేరే ఏ కార్యక్రమమూ జరగలేదు పార్టీలో. గత ఎన్నికలో తప్పకుండా గెలుస్తామన్న చాలా నియోజకవర్గాల్లో కూడా మట్టికరవాల్సి వచ్చింది. అందుకు కారణం పార్టీని సక్రమంగా నడిపేవారు లేకపోవడమే. వాస్తవానికి టీడీపీకి ఉన్నంత పటిష్టమైన క్యాడర్ వేరే ఏ పార్టీకి లేదనే అనాలి. ఇప్పటికీ సంస్థాగతంగా తెలుగుదేశం బలంగానే ఉంది. అంతెందుకు పార్టీ శ్రేణులే ఏదో ఒకటి చేసి పునర్వైభవం తీసుకురండి, మీరేం చేసినా అండగా మేముంటాం అంటున్నారు. దీన్నిబట్టి లోపం నాయకత్వంలోనే ఉందని అర్థమవుతోంది.
అసలు సుమారు 30 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన ఇంఛార్జిలు లేరంటే నమ్ముతారా. కానీ అదే నిజం. 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. స్థానిక నేతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలా వేసి పట్టుకుని తమతో తీసుకుపోతున్నారు. ఇంకొందరు పాలకవర్గంతో ఎక్కడ ఢీకొట్టగలం అంటూ మౌనం పాటిస్తున్నారు. ఇక యువ నాయకత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలా దూకుడు కలిగిన నాయకులు లోపించడంతో శ్రేణులు సైతం నీరసించిపోతున్నారు. పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. దీన్నే అదునుగా భావించిన వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులను ఏదో ఒకరకంగా తమలో కలిపేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు నడిస్తే ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీచేయడానికి కూడ అభ్యర్థులు దొరకరక్కపోవచ్చు.