ఇంటర్నెట్ లేకపోతే పూట గడవని పరిస్థితి. కానీ, కొత్త జిల్లా వచ్చిందన్న ఆనందం కోనసీమ వాసులకు ఎక్కు రోజులు నిలవలేదు. ఇంటర్నెట్ లేక కోనసీమ జిల్లా ప్రజానీకం నానా తంటాలూ పడుతున్నారు. జిల్లా పేరు మార్పు నేపథ్యంలో తలెత్తిన అల్లర్లను అదుపు చేయడానికి గత కొద్ది రోజులుగా కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ బంద్ అయ్యింది. జమ్మూకాశ్మీర్‌లో గతంలో ఇలాంటి పరిస్థితుల్ని చూశాం. వాటి గురించి విన్నాం.!
పచ్చని కోనసీమలో ఇదేం దుస్థితి.? అని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇంటర్నెట్ ఆధారంగా చేసుకునే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వర్క్ ఎట్ హోం చేస్తున్నారు. చాలాకాలంగా హైద్రాబాద్‌లోనో, బెంగళూరులోనో వున్న తమ కార్యాలయాలకు వెళ్ళకుండా, సొంతూరిలో వుంటూ అక్కడి ప్రకృతితో మమేకం అవుతూ తమ విధులు నిర్వహిస్తున్నారు.
వాళ్ళకి ఇప్పుడు ఇంటర్నెట్ బంద్ అవడంతో కొత్త సమస్య వచ్చి పడింది. జిల్లాల సరిహద్దులకు కంప్యూటర్ సహా సరంజామా అంతా వేసుకుని వెళ్ళాల్సి వస్తోంది. చాలామంది పొరుగు జిల్లాల్లోని తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు..
ఇంటర్నెట్ ఇంకొన్ని రోజులు బంద్ అయితే, తాము ఆందోళనలకు దిగాల్సి వస్తుందని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే కాదు, సామాన్యులూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. చెల్లింపులన్నీ ఇప్పుడు ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్నాయి. కిరాణా దుకాణాల్లోనూ చెల్లింపులకు ఇంటర్నెట్ ఆధారమైపోయింది. ఇంటర్నెట్ బంద్ అవడంతో, వ్యాపార కార్యకలాపాలూ ఆగిపోయాయి.
ఇంతకు ముందున్నడూ చూడని ఈ వింత పరిస్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నది స్థానికంగా వినిపిస్తోన్న అభిప్రాయం.