మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఇలా ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడం, అలా ఆయన రాజీనామాకు ఆమోదం లభించడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయబోయే రాజీనామాకు ఆమోదం లభించదనీ, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనతో వున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఏదోలా ఆ రాజీనామా ఆమోదాన్ని ఆలస్యం చేయిస్తారనీ ప్రచారం జరిగిన విషయం విదితమే.
ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకి ఆమోదం లభించిందో, ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారమే లేదని తేలిపోయింది. దాదాపుగా ఏడాదిన్నర సమయం వుంది తెలంగాణలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. మామూలుగా అయితే, ఆరు నెలల్లోపే ఉప ఎన్నిక జరగాల్సి వుంది.
ఇదిలా వుంటే, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్న దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకింత సీరియస్‌గానే ఆలోచన చేసినా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అదే సలహాని ముఖ్యమంత్రికి ఇచ్చినా.. ఎందుకో కేసీయార్, ముందస్తు ఎన్నికల విషయమై పంథా మార్చారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం సంగతి తర్వాత, ముందైతే తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవాలి.. ఆన్న రీతిలో డిఫెన్స్‌లో పడిపోయారు కేసీయార్. ఈ నేపథ్యంలోనే, ముందస్తు ముచ్చట కూడా పక్కన పెట్టి, రానున్న రోజుల్లో పూర్తిగా ప్రజల్లో మమేకమయ్యేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారట. బీజేపీ వ్యూహాల్ని తిప్పి కొట్టడం ఇప్పుడు కేసీయార్ ముందున్న అతి పెద్ద టాస్క్.!