తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు తమని తాము హింసించుకున్నారు.. ఆత్మబలిదానాలు చేసుకున్నారు.. అంతే తప్ప, ఆంధ్రోళ్ళ మీద దాడి చేయలేదంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతో ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు.
నిజమే, తెలంగాణ కోసం చాలామంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారు. అదేంటో, రాజకీయ నాయకులెవరూ ఆ పని చేయలేకపోయారు. యువతని రెచ్చగొట్టి, ఆత్మ బలిదానాలవైపు పురిగొల్పింది రాజకీయ నాయకులేనన్న విమర్శ గతంలోనూ వినిపించింది.
సరే, ఆ సంగతి పక్కన పెడదాం. అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఎమ్మెల్యే, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మీద జరిగిన దాడి మాటేమిటి.? సీమాంధ్రులపై దాడులు జరగలేదన్నది ఉత్తమాట.. జరిగాయి.. కానీ, దానికి కారణం తెలంగాణ సమాజం కాదు. కొందరు రాజకీయ నాయకులు మాత్రమే. సరే, అది గతం.
తెలంగాణ ఉద్యంలో నానా రకాల నిందలూ మోపారు.. బూతులు తిట్టారు.. ఇవన్నీ సీమాంధ్రులు భరించినవే. సెటిలర్లు.. అంటూ ఎగతాళి కూడా చేశారు. ఇప్పుడేమో సెటిలర్లన్న ప్రస్తావనే లేదంటున్నారు శ్రీనివాస్ గౌడ్.
మరి, లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. ఆంధ్రలో పుట్టినోళ్ళెవరూ తెలంగాణ మేలు కోరుకోరని తెలంగాణ మంత్ర వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల సంగతేంటి.? ఆంధ్రపదేశ్ – తెలంగాణ మధ్య నీటి పంచాయితీ వుంటే, అది ప్రభుత్వాల స్థాయిలో జరిగే చర్చల ద్వారా పరిష్కారం వెతకగలిగే సమస్య మాత్రమే. అంతే తప్ప రాజకీయ వివాదాలతో కాలయాపన చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో ప్రతిపక్షం కానే కాదు.
అధికారంలో వున్నప్పుడు కాస్తంత సంయమనం పాటించాలి. ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలే జరగకుండా, కనీసం అధికారుల స్థాయిలో అయినా చర్చలు జరగకుండా ఏంటీ రాజకీయ రచ్చ.? ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి ఏంటి.? ఎవర్ని రెచ్చగొట్టడానికీ ప్రయత్నాలు.? తెలంగాణ సమాజం కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నేతల తీరు చూసి విస్మయం చెందుతోంది.