ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడిగా తప్పుకోవడంతో ఇప్పుడా పోస్ట్ కి ఖాళీ ఏర్పడింది. ఆయన తప్పుకోవడానికి గల కారణాలు పక్కన బెడితే! ఇప్పుడు కాపు ఉద్యమానికి ఓ నాయకుడు కావాలి. కాపు కాసే నాయకుడు అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడా బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ కులాన్ని సమర్ధవంతగా నడిపించే నాయకుడు ఎవరు? అంత సత్తా ఎవరిలో ఉంది? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ముద్రగడ కాపుల్లో ఫేమస్ పర్సనాల్టీ గా నిలిచారు. గట్స్ ఉన్న నాయకుడిగా ఉద్యమ సమయంలో నిలబడ్డారు. తుని రైలు దుర్ఘటన తర్వాత ముద్రగడ క్రేజ్ అంతకంతకు పెరిగిపోయింది.
అప్పటికే ఆయనకున్న రాజకీయం అనుభవం, మంత్రిగా పనిచేసిన చేసిన అనుభవం కాపు ఉద్యమాన్ని బలంగా నడిపించాయి. కానీ ఇప్పుడంత బలమైన నాయకుడు దొరుకుతాడా? అన్నదే సశేషం. ఏపీ రాజకీయాలలలో కాపు ఓట్లు అత్యంత కీలకమైనవి. బీసీ సామాజిక వర్గం తర్వాత అత్యధిక ఓటు బ్యాంక్ కల్గింది కాపు సామాజిక వర్గమే. కాబట్టి కాపులు ముందు తోకలు జాడించడానికి ఏ నాయకుడికి కుదరదు. ఇన్నాళ్లు కాపుల్ని రాజకీయంగా వాడుకుని వదిలేసారు? అన్న కసి పట్టుదల ఇప్పుడా వర్గంలో బలంగా తయారైంది. ఈ నేపథ్యంలో పోరాట పటిమ గల కాపు నాయకుడ్ని తెచ్చుకోవాలని 13 జిల్లాల కాపు నేతల జేఏసీలు ఇప్పుడు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడ్నే తెరపైకి తెచ్చే ప్రయత్నాలైతే ఓ పక్క జరుగుతున్నాయి. అయితే దీని వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారా? లేరా? అన్నదే సందేహం. ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఓ నాయకుడ్ని వెనుకుండి నడిపించ గల్గితే మాత్రం కాపు ఉద్యమానికి తిరుగుండదు అన్నది వాస్తవం. అయితే ఆయన ఈ విషయంలో కల్పించుకుంటారా? లేదా? అన్నదే సందేహం. పవన్ కుల, మతాలకు అతీతంగా ఉండే వ్యక్తి. పార్టీపై కులం అనే మచ్చ పడకుండా జాగ్రత్తపడుతున్నారు. సమసమాజ స్థాపనకు పాటు పడుతోన్న పార్టీ అది. కాబట్టి పవన్ ఈ విషయంలో కాపులకు దూరంగా ఉండే అవకాశం ఉంది.