No Cases : చిన్న చిన్న విషయాలకే ఆంధ్రప్రదేశ్ పోలీసులు బలమైన కేసులు పెట్టేస్తున్నారా.? కేవలం అధికార పార్టీకి అనుకూలంగా మాత్రమే వ్యవహరిస్తూ, ప్రతిపక్షాల్ని టార్గెట్ చేసేలా పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా.? ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే పోలీసు వ్యవస్థ నడుచుకుంటోందా.? ఇదంతా కేవలం వైఎస్ జగన్ హయాంలోనే నడుస్తోందా.?
చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటి తీరే నడిచింది. అలాగని, తాము కూడా అలాగే వ్యవహరిస్తామని అధికార వైసీపీ చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. అప్పట్లో వాళ్ళు అధికారాన్ని అడ్డగోలుగా వాడేశారు గనుక, తామూ అంతకన్నా బీభత్సంగా వాడేస్తున్నామని వైసీపీ చెప్పకనే చెబుతోంది తమ చర్యల ద్వారా.
మధ్యలో పోలీసు వ్యవస్థే అభాసుపాలవుతోంది. ముఖ్యమంత్రిపై దూషణలకు దిగడం సహించరాని నేరం. విమర్శ వేరు, దూషణలు వేరు. అలాంటి చర్యలకు కేసులు తప్పవు. కేసులు పెట్టాక అరెస్టులూ కొన్ని సందర్భాల్లో తప్పకపోవచ్చు. నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం.. ఇదంతా ఓ ప్రక్రియ.
ముఖ్యమంత్రిని దూషిస్తేనే కేసులు పెడతారా.? విపక్ష నేతల్ని దూషిస్తే కేసులు నమోదు చెయ్యరా.? అన్నది ఇతర రాజకీయ పార్టీల నుంచి వస్తోన్న ప్రశ్న. పోలీసు వ్యవస్థ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది. చంద్రబాబుని నానా రకాలుగా దూషించిన వైసీపీ నేతల్లో ఎవర్నీ ఇంతవరకు అరెస్టులు చేయలేదు.
అదే, ముఖ్యమంత్రి మీద దూషణలకు దిగితే విపక్ష నేతల అరెస్టులు జరిగిపోతున్నాయ్. ‘అధికార పార్టీ నేతల్ని అరెస్టు చేయట్లేదు కాబట్టి, మా నేతల్ని అరెస్టు చేయడానికి వీల్లేదు..’ అని అంటున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మరి, లోకేష్ మంత్రిగా వున్నప్పుడు..
అధికార పార్టీ నేతల్ని అరెస్టు చేయకుండా, విపక్ష నేతల్ని ఎందుకు అరెస్టు చేసినట్టో.?
పార్టీల పంచాయితీ కాదిది. పోలీసు వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది.