టీడీపీతో పొత్తు లేదు: స్పష్టతనిచ్చిన జనసేనాని.!

రాష్ట్రంలో టీడీపీతో పొత్తు వుండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చేశారు. మూడో ప్రత్యామ్నాయం అవసరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సో, ఇక్కడితో టీడీపీ – జనసేన మధ్య పొత్తు వుంటుందనే ప్రచారానికి తెరపడిందని అనుకోవాలా.? లేదంటే, తరచూ మాట మార్చే పవన్ కళ్యాణ్, ఇంకోసారి ‘తూచ్’ అనేస్తారా.?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! అందునా, మాట మీద స్థిరత్వం లేని జనసేనాని ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎలా ఊహించగలం.? తిరుపతిలో జనసేన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోపాటు, తెలంగాణ రాజకీయాల గురించీ మాట్లాడేశారు. ఈ క్రమంలోనే మూడో ప్రత్యామ్నాయం ప్రస్తావన కూడా తెచ్చారు.

వైసీపీతో కలవం, టీడీపీతోనూ కలవం.. అనేశారు జనసేనాని. వైసీపీతో ఎలాగూ కలవరు. ఎందుకంటే, వైసీపీతో కనీ వినీ ఎరుగని రీతిలో శతృత్వం నడుపుతోంది జనసేన పార్టీ. టీడీపీతో మాత్రం చిత్ర విచిత్రమైన అనుబంధాన్ని జనసేనాని కొనసాగిస్తున్నారు. అదిప్పుడు తెగిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకో ఏమో, ఆయనకే తెలియాలి.

మూడో ప్రత్యామ్నాయం అంటే, జనసేనాని గతంలో వామపక్షాలతో కలిశారు.. దాన్నేమనాలి.? బీఎస్పీతో కూడా కలిశారు.. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఇంతకీ, మిత్ర పక్షం బీజేపీతో జనసేన కలిసే వుందా.? విడిపోయిందా.? ఇదైతే ఇంకాస్త స్పష్టత రావాల్సిన ముఖ్యమైన అంశం. మాటలు మెండుగా వుంటాయ్.. చేతలేమో చప్పగా వుంటాయ్. ఇదీ జనసేనాని తీరు.

ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. అప్పటికల్లా ఈక్వేషన్స్ మారిపోతాయ్. ఈలోగా ఎందుకీ పొత్తుల వ్యాఖ్యలు.? ప్రత్యమ్నాయాల గురించిన మాటలు.? నిత్యం జనంలో వుండి, ప్రజా సమస్యలపై గళం విప్పితే, రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నది నిర్వివాదాంశం. కానీ, ఆద్భుతమైన అవకాశాన్ని జనసేనాని స్వయంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు.